నలుగురు కాదు ఇద్దరే..!
సంక్రాంతి హీరో అనిపించుకోవాలని పరిశ్రమలో ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఆ అవకాశం కోసం కథానాయకులంతా ప్రత్యేకమైన ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. ఎన్ని సినిమాలు విడుదలైనా ప్రేక్షకులు చూసేందుకు థియేటర్‌కి వచ్చేది కూడా అప్పుడే. ఆ సమయంలో సినిమా విడుదలైందంటే హిట్టు గ్యారెంటీ అనే ఓ బలమైన నమ్మకాన్ని పరిశ్రమ వర్గాలు వ్యక్తం చేస్తుంటాయి. అందుకే అటు కథానాయకులు, ఇటు దర్శక నిర్మాతలు కుదిరితే సంక్రాంతి సీజనే లక్ష్యంగా సినిమాలు చేయడానికి ఇష్టపడుతుంటారు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన సినిమాలన్నీ మంచి ఫలితాన్నే సొంతం చేసుకొన్నాయి.
బాక్సాఫీసు దగ్గర వసూళ్ల వరద పారించాయి. అందుకే వచ్చే సంక్రాంతికి భారీ డిమాండ్ ఏర్పడింది. అగ్ర కథానాయకులంతా కూడా 2017 సంక్రాంతిని లక్ష్యంగా చేసుకొన్నారు. మొన్నటిదాకా సీనియర్ కథానాయకులు నలుగురూ సంక్రాంతి బరిలో నిలిచేలా కనిపించారు. ఇంతలో అనూహ్యంగా వెంకటేష్, నాగార్జున చిత్రాలు బరిలో నుంచి తప్పుకొన్నాయి. దాంతో ఈసారి సంక్రాంతికి సందడి చేసే అగ్ర కథానాయకులు చిరంజీవి, బాల కృష్ణే అని తేలిపోయింది. వారికి తోడుగా గతేడాది ‘ఎక్స్‌ప్రెస్ రాజా’తో సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకొచ్చి విజయాన్ని సొంతం చేసుకొన్న యువ కథానాయకుడు శర్వానంద్ రాబోతున్నాడు.
ఒక స్టార్ కథానాయకుడి సినిమా విడులదవుతోందంటేనే బాక్సాఫీసు కళకళలాడిపోతుంది. అలాంటిది నలుగురు స్టార్ కథానాయకుల సినిమాలంటే ఇక సందడి ఏ స్థాయిలో ఉంటుందో హించుకోవచ్చు. థియేటర్ల సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలుంటాయని తెలిసినప్పటికీ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున… ఈ నలుగురి సినిమాలూ సంక్రాంతినే లక్ష్యంగా చేసుకొని శరవేగంగా చిత్రీకరణని జరుపుకొన్నాయి. దాంతో ప్రేక్షకులు కూడా ‘నాలుగు సినిమాలూ వచ్చేలానే ఉన్నాయి. అరుదైన ఆ సందడిని చూసేద్దాం’ అనుకొంటూ టిక్కెట్లు తెగ్గొట్టేందుకు సిద్ధమయ్యారు. ఇంతలోనే సంకేతాలు మారిపోయాయి. ఈసారి సంక్రాంతి బరిలో చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నంబర్ 150’, బాలకృష్ణ వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ మాత్రమే నిలవబోతున్నాయి. వెంకటేష్, నాగార్జున చిత్రాలు సంక్రాంతి తర్వాతే విడుదల కాబోతున్నాయి.
నిర్మాణానంతర పనుల కోసమే..: నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన ‘ఓం నమో వేంకటేశాయ’, వెంకటేష్ కథానాయకుడిగా నటించిన ‘గురు’ సినిమాలు ఇప్పటికే చిత్రీకరణని పూర్తి చేసుకొన్నాయి. విడుదల మాత్రం సంక్రాంతి తర్వాతే. నాగార్జున హథీరాం బాబా పాత్రలో కె.రాఘవేంద్రరావు దర్శకుడిగా తెరకెక్కుతున్న ‘ఓం నమో వేంకటేశాయ’ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్‌కి పెద్దపీట వేశారు. ఆ పనులు పూర్తవ్వడానికి చాలా సమయం పడుతుందట. నేపథ్య సంగీతం కోసం కూడా సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్.కీరవాణి రెండు నెలల సమయం అడిగారట. అందుకే నాగార్జున తీరిగ్గా తన సినిమాని ఫిబ్రవరిలో విడుదల చేయాలని నిర్ణయించారు. సుధ కొంగర దర్శకత్వంలో వెంకీ కథానాయకుడిగా నటించిన ‘గురు’ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న విడుదల కాబోతోంది. ఈ రెండు సినిమాలూ ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్ని జరుపుకొంటున్నాయి.
ముస్తాబవుతున్న 100… 150: మైలురాయిల్లాంటి సినిమాలు ఈసారి సంక్రాంతి బరిలో నిలుస్తున్నాయి. బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’, చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నంబర్ 150’ చిత్రాలు సంక్రాంతికి విడుదలయ్యేందుకు వేగంగా ముస్తాబవుతున్నాయి. చిరంజీవి, బాలకృష్ణలిద్దరూ కూడా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించి ఈ సినిమాల్ని పట్టాలెక్కించారు. కొబ్బరికాయ కొట్టిన రోజునే సంక్రాంతికి వస్తున్నాం అని ప్రకటించారు. చెప్పినట్టుగానే పకడ్బందీ ప్రణాళికలతో సినిమాల్ని విడుదల చేస్తున్నారు. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా చిత్రీకరణ ఇప్పటికే పూర్తయిపోయింది.
ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలతో బిజీగా గడుపుతోంది చిత్రబృందం. చిరంజీవి సినిమా కూడా గురు వారంతో టాకీభాగం పూర్తి చేసుకొంది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో నృత్య దర్శకుడు శంకర్ నేతృత్వంలో పాటని తెరకెక్కిస్తున్నారు. ఆ పాటతో సినిమా మొత్తం పూర్తయిపోతుంది. ‘‘చిరంజీవి సినీ జీవితంలోనే ఓ ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోయేలా దర్శకుడు తీర్చిదిద్దుతున్నార’’ని నిర్మాత రామ్‌చరణ్ చెబుతున్నారు. సంక్రాంతికొచ్చే ప్రధానమైన ఈ రెండు సినిమాల విడుదలకీ నెలకిపైగా సమయం ఉంది. ఆలోపు విస్తృతంగా ప్రచార కార్యక్రమాల్నీ నిర్వహించే పనిలో ఉన్నారు. వీటితో పాటు శర్వానంద్ ‘శతమానం భవతి’ కూడా ఇటీవలే చిత్రీకరణని పూర్తి చేసుకొంది.
లేబుళ్లు: sankranthi relaese, telugu movies


0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< హోమ్