బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ మరియు దర్శకురాలు ఫరా ఖాన్ తన వ్యక్తిగత జీవితం గురించి చేసిన తాజా వ్యాఖ్యలు సినీ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. స్టార్ హీరోలకు డ్యాన్స్ మాస్టర్‌గా, 'మై హూ నా', 'ఓం శాంతి ఓం' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల దర్శకురాలిగా ఫుల్ పాపులారిటీలో ఉన్న ఫరా, తన భర్త శిరీష్ కుందర్ గురించి చేసిన కామెంట్లు ఎవరూ ఊహించని విధంగా ఉన్నాయి.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో, ఫరా ఖాన్ తన భర్తతో తొలి పరిచయాన్ని గుర్తు చేసుకున్నారు. శిరీష్ కుందర్‌ను నేను మొదటిసారి కలిసినప్పుడు, అతను గే అని అనుకున్నాను. దాదాపు మొదటి ఆరు నెలలు అదే అభిప్రాయంతో ఉన్నానని చెప్పి ఆమె అందరినీ ఆశ్చర్యపరిచారు. అతని ప్రవర్తన, వ్యవహార శైలి వల్లే తాను అలా అనుకున్నానని ఫరా వెల్లడించారు. అయితే, ఆ తర్వాత అతని గురించి మరింత తెలుసుకున్న మీదట, తన అభిప్రాయం పూర్తిగా మారిందని ఆమె తెలిపారు.
ఆమె వ్యాఖ్యలు ఇక్కడితో ఆగలేదు. దర్శకుడు, ఫిల్మ్ ఎడిటర్ అయిన శిరీష్ కుందర్‌ను ప్రేమించి 2004లో వివాహం చేసుకున్న ఫరా, తమ వైవాహిక జీవిత ప్రారంభంలోని సవాళ్లను కూడా పంచుకున్నారు. పెళ్లైన మొదటి సంవత్సరంలోనే పారిపోవాలని అనుకున్నాను. ఎందుకంటే, కొత్త జీవితానికి, కొత్త అలవాట్లకు సర్దుకుపోవడం చాలా కష్టంగా ఉండేదని ఫరా ఖాన్ అంగీకరించారు.
