ఒక మోస్తరు రైల్వే స్టేషన్లు మాత్రమే కాదు.. నిత్యం వేలాది మంది ప్రయాణికులతో కిటకిటలాడే రైల్వేస్టేషన్లలో ఫుడ్ కావాలంటే లిమిటెడ్ ఆప్షన్స్ మాత్రమే లభించే పరిస్థితి. దీనికి కారణం.. రైల్వే బోర్డుకు ఉన్న క్యాటరింగ్ పాలసీ. తాజాగా సౌత్ సెంట్రల్ రైల్వే చేసిన ప్రతిపాదన ఇప్పుడు రైల్వే శాఖ తన క్యాటరింగ్ పాలసీనే మార్చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో.. దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లలో ప్రీమియం బ్రాండ్ క్యాటరింగ్ ఔట్ లెట్స్ అందుబాటులోకి రానున్నాయి.
అంటే.. దీని అర్థం రానున్న రోజుల్లో రైల్వే స్టేషన్లలో మెక్ డోనాల్డ్స్.. హల్దీరామ్స్.. కేఎఫ్ సీ.. పిజ్జాహట్.. బాస్కిన్ రాబిన్స్.. బికనీర్ వాలా.. లాంటి ఎన్నో ప్రముఖ ఫుడ్ చైన్లు తమ ఔట్ లెట్లను ప్రారంభించే దిశగా రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించి తాజాగా సర్క్యులర్ ను ఆయా జోన్లకు పంపటం గమనార్హం. డిమాండ్ - స్పేస్ ప్రమాణాలు నెరవేర్చినట్లయితే సింగిల్ బ్రాండ్ ఔట్ లెట్స్ అనుమతి ఇవ్వనున్నట్లుగా అందులో పేర్కొన్నారు.
దీంతో.. ఔట్ లెట్స్ ను అయితే కంపెనీలు స్వయంగా నడుపుకోవచ్చు.. లేదంటే ఫ్రాంఛైజీల ద్వారా నిర్వహించుకునే వీలు ఉంటుంది. ఎంపిక విధానం మాత్రం ప్రస్తుతం ఎలా అయితే ఈ ఆక్షన్ ద్వారా నిర్వహిస్తారో.. దాన్నో అనుసరిస్తారు. ఇప్పటివరకు రైల్వే స్టేషన్లలో కాఫీ..టీ.. లైట్ స్నాక్స్ లాంటి మూడు రకాల స్టాళ్లు ఉండగా.. ఇప్పుడు ప్రీమియం బ్రాండ్ క్యాటరింగ్ వర్గాన్ని కొత్తగా జోడిస్తున్నారు. ఈ తరహా ఔట్ లెట్లకు ఐదేళ్ల పాటు ఒప్పందం ఉంటుంది. కనీస లైసెన్స్ ఫీజు ప్రస్తుతం అనుసరిస్తున్న నిబంధనల ప్రకారమే కంటిన్యూ అవుతాయని చెబుతున్నారు.
మొత్తంగా చూస్తే.. రానున్న రోజుల్లో రైల్వే స్టేషన్లలో ఫుడ్ ఆప్షన్లు పెరిగిపోవటమే కాదు.. ఎంచక్కా రైల్వే స్టేషన్లలో ఇలా కొనేసి.. అలా ట్రైన్ ఎక్కేసే వీలుంది. ఇదిలా ఉంటే.. ఈ కొత్త పాలసీలో భాగంగా స్టాల్స్ ఏర్పాటు విషయంలో ఎస్సీ.. ఎస్టీ.. ఓబీసీ.. స్వాతంత్ర్య సమరయోధులు.. రైల్వే భూసమీకరణలో భూమి కోల్పోయిన వారి కోటా గతంలో మాదిరే ఉండనుంది. ప్రీమియం ఔట్ లెట్ల కారణంగా ఈ కోటాపై ఎలాంటి ప్రభావం చూపదని రైల్వే అధికారులు స్పష్టం చేస్తున్నారు.