Vangaveeti Ranga: విజయవాడ రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి. వీటికి- దివంగత కాపు నేత వంగవీటి మోహనరంగా కుటుంబం కేంద్ర బిందువుగా మారుతోంది. మొన్నటికి మొన్న వంగవీటి రాధా.. మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారనే ప్రచారం జోరుగా సాగింది. ఆ పార్టీ సీనియర్ నాయకులు, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. ఆయన ఇంటికి వెళ్లడంలో అప్పట్లో చర్చనీయాంశమైంది.
ఇప్పుడు తాజాగా రంగా కుటుంబం నుంచి మరొకరు రాజకీయాల్లోకి రాబోతోన్నారనే ప్రచారం జిల్లా రాజకీయాల్లో ముమ్మరమైంది. రంగా వారసురాలిగా ఆయన కుమార్తె ఆశ కిరణ్ పూర్తిస్థాయి రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తారని, దీనికి సంబంధించిన ఓ అధికారిక ప్రకటన రేపో, మాపో ఉండొచ్చని చెబుతున్నారు. దీనికి కారణాలు లేకపోలేదు. విజయవాడ బందరు రోడ్డులోగల రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టే విషయాన్ని తోసిపుచ్చట్లేదు. రాజకీయాల్లోకి వచ్చే విషయంపై మరోసారి మాట్లాడదామని అన్నారు. విజయవాడతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో వంగవీటి రంగా వారసత్వాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఆ బాధ్యతను తీసుకుంటారా? అని అడిగిన ప్రశ్నను దాటవేశారు. దీనిపై మరోసారి మాట్లాడతానని చెప్పారు. రంగా ఒక్క కాపు కులానికి మాత్రమే పరిమితమైన నాయకుడు కాదని అన్నారు.
Telugu Political news latest
