మెహసానా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్, ఆర్‌బీఐ సూచనల మేరకు చిన్న డినామినేషన్ నోట్లు, కొత్త నాణేలు పంపిణీ చేసే ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు.
నోట్ల రద్దు రోజుల్లో కనిపించిన ఆ గందరగోళ దృశ్యం మళ్లీ గుర్తుకు వచ్చింది. గుజరాత్ మెహసానాలో అదే సన్నివేశం ఒక్కసారిగా కనుల ముందు మెదిలింది. కానీ ఈసారి జనాల చేతిలో పాత నోట్లు గానీ, పెద్ద డిపాజిట్లు గానీ లేవు.. చిల్లర లేదు! చిన్న నోట్ల కొరత ఎంత తీవ్రంగా ఉందంటే, ఉదయం నుంచి బ్యాంక్ ఎదుట వందల మంది వరుసగా నిల్చుని తమ వంతు కోసం వేచి ఉన్నారు.
మెహసానా అర్బన్ బ్యాంకు ఎదుట బారులు..
మెహసానా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్, ఆర్‌బీఐ సూచనల మేరకు చిన్న డినామినేషన్ నోట్లు, కొత్త నాణేలు పంపిణీ చేసే ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు. దీనిపై బ్యాంకు ముందుగా ప్రచారం చేసింది. దీంతో ఆ ప్రాంతం మొత్తం ఒకేసారి బ్యాంక్ వైపు దూసుకువచ్చింది. ‘కొత్తగా ముద్రించిన ₹10 నోట్లు, ₹2–₹5 నాణేలు అక్కడ అందుబాటులో ఉన్నాయి.’ ఉదయం 10 గంటలకు ప్రారంభమైన క్యాంప్ బయట, సినిమా టికెట్ల కోసం ఉండే క్యూలా రద్దీ కనిపించింది. పక్కనే చిన్నారులను పట్టుకొని వచ్చిన తల్లులు, చిల్లర కోసం బాధపడుతున్న చిరు వ్యాపారులు, ఇంట్లో పెళ్లి పనుల్లో ఉన్న కుటుంబాలు అందరూ ఒకే మాట చెబుతున్నారు.. ‘రోజువారీ ఖర్చులకు ఇబ్బంది ఎదురవుతుంది.. చిల్లర దొరకడం లేదు!’ అని.
స్పెషల్ క్యాంపు ద్వారా రూ. 14 లక్షలు పంపిణీ..ఈ క్యాంప్‌లో బ్యాంక్ అధికారులు మొత్తం ₹14 లక్షల విలువైన ₹10 నోట్ల కట్టలు.. కొన్ని ₹20 నోట్ల బ్యాండిల్స్.. ₹3 లక్షల విలువైన ₹2, ₹5 నాణేలు పంపిణీ చేశారు. క్యూలో నిల్చున్నవారి మాటల్లోనే అసలు పరిస్థితి బయటపడింది.. ఏటీఎంలు చిన్న నోట్లు ఇవ్వడం లేదు.. వ్యాపారులు వద్ద చిల్లర లేకపోవడంతో లావాదేవీలు నిలిచిపోతున్నాయి, పాత నోట్లు చిరిగిపోవడంతో ఉపయోగించలేకపోతున్నారు.
బ్యాంక్ మేనేజర్ ముకేష్ భాయ్ పటేల్ మాట్లాడుతూ.. ‘స్థానిక వ్యాపారుల ఫిర్యాదులు పెరగడంతో, ఆర్‌బీఐ మార్గదర్శకాలు అనుసరించి చిల్లర క్యాంప్ ఏర్పాటు చేశాం’ అన్నారు. ఇక ప్రజల స్పందన చూస్తే స్పష్టం అవుతోంది. పెద్ద పెద్ద ఆర్థిక నిర్ణయాలు అవసరం లేదు.. చిన్న చిన్న చిల్లర కోసం కూడా బ్యాంకుల ఎదుట బారులు తీరుతారని తెలుస్తుంది. చిల్లర కొరత ఒక్కటే సరిపోతుంది. ఇదొక్కటి చాలు ప్రజల దైనందిన జీవితాన్ని పూర్తిగా కుదిపేయడానికి!
Tags: mehsana coinshortage smallnotes bankqueues indiafinancialnews mehsanabank smallchange currencycamp rbiupdate
