రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో రాబోతున్న 'వారణాసి' గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకటే చర్చ. ఈ మధ్య విడుదలైన 'వారణాసి వరల్డ్' గ్లింప్స్ చూసిన తర్వాత, సినిమా కథపై ఫ్యాన్స్ రకరకాల సిద్ధాంతాలు వినిపిస్తున్నారు. ఇందులో ఒక ఆసక్తికరమైన థియరీ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. అదేంటంటే, ఈ సినిమా ఒక 'టైమ్ ట్రావెల్' కాన్సెప్ట్ తో సాగే ఫాంటసీ అడ్వెంచర్ అని.
ఈ థియరీ ప్రకారం, కథలో కుంభా (పృథ్వీరాజ్ సుకుమారన్) అనే పవర్ ఫుల్ విలన్ ఉంటాడు. అతనికి అమరత్వం కావాలి, ప్రపంచాన్ని కంట్రోల్ చేయాలనే అత్యాశ ఉంటుంది. ఆ అమరత్వం కోసం 'సంజీవని' అనే మూలిక కోసం వెతుకుతుంటాడు. ఇక మన హీరో రుద్ర (మహేష్ బాబు) ఒక సాధారణ వ్యక్తిలా పరిచయం అవుతాడు. ఈ ఇద్దరి మధ్య జరిగే పోరాటమే అసలు కథ అని చెప్పుకుంటున్నారు.
కథ ఇక్కడే మలుపు తిరుగుతుంది. సంజీవని ఈ కలియుగంలో దొరకదు. దాన్ని వెతుక్కోవాలంటే త్రేతాయుగానికి వెళ్లాలి. దీనికోసం ఒక టైమ్ పోర్టల్ ఉంటుంది. ఆ పోర్టల్ ఓపెన్ అవ్వాలంటే మూడు తాళాలు కావాలి. ఒకటి విభూది, రెండు త్రిశూలం, మూడు నందీశ్వరుడు. ఈ మూడు ఒక్కచోట కలిస్తేనే కాలం వెనక్కి వెళ్లే మార్గం దొరుకుతుందట. రుద్రుడే ఆ విభూది స్వరూపమని, త్రిశూలం పట్టుకుని నందిపై స్వారీ చేస్తాడని, ఆయనే ఆ కీ అని ఈ థియరీ సారాంశం.
ఈ క్రమంలో మందాకిని (ప్రియాంక చోప్రా) పాత్ర కీలకంగా మారుతుందట. మొదట్లో ఆమె విలన్ వైపు ఉన్నా, తర్వాత నిజం తెలుసుకుని హీరోకి సహాయం చేస్తుందని టాక్. ఇలా రుద్రుడు టైమ్ ట్రావెల్ చేసి, త్రేతాయుగంలో ఆ యుద్ధభూమిలో సంజీవనిని సాధించి, తిరిగి వచ్చి విలన్‌ను అంతం చేస్తాడని అంటున్నారు. క్లైమాక్స్ లో ఆస్టరాయిడ్ వల్ల వచ్చే వైరస్ నుంచి ప్రపంచాన్ని కాపాడటమే మన హీరో మిషన్ అని చెప్పుకుంటున్నారు.
ఇదంతా వినడానికి ఒక హాలీవుడ్ రేంజ్ కథలా ఉంది. 90ల స్టైల్ బ్లాక్ బస్టర్ డ్రామాకి, మోడరన్ విజువల్స్ జోడిస్తే ఎలా ఉంటుందో అలా అనిపిస్తోంది. ఒక మామూలు మనిషి గ్లోబల్ అడ్వెంచర్ చేసి, చివరకు ప్రపంచాన్ని కాపాడే దేవుడిలా మారడమే రాజమౌళి మార్క్ ఎలివేషన్ అని మాట్లాడుకుంటున్నారు.
అయితే, ఇవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమే. రాజమౌళి సినిమా అంటే ఇలాంటి ఎన్నో సర్ప్రైజ్‌లు ఉంటాయి. ఫ్యాన్స్ డీకోడ్ చేసిన ఈ కథ నిజమవుతుందా లేక జక్కన్న ఇంకేదైనా కొత్త ప్రపంచాన్ని చూపిస్తారా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఏదేమైనా, 'వారణాసి' కథపై జరుగుతున్న ఈ చర్చ సినిమాపై అంచనాలను మాత్రం హై లెవెల్ కి తీసుకెళ్తోంది.