జూబ్లీ ఉపఎన్నిక ఫలితం వెలువడిన వేళ.. ముఖ్యమంత్రి రేవంత్ మీడియా భేటీని ఏర్పాటు చేయటం.. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలుగు రాజకీయాల్లో పెద్ద ఫజిల్ గా ఉండే రాజకీయ పార్టీ అధినేత ఎవరైనా ఉన్నారంటే.. ఆ స్థానంలో మొదటిగా వస్తారు బీఆర్ఎస్ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తారు. ఎప్పుడు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటో.. ఎలాంటి అడుగు వేస్తారో అస్సలు అంచనా వేయలేని అధినేతగా ఆయన్ను చెప్పాలి. కొన్నిసార్లు.. కొన్ని సందర్భాలకు ఇట్టే స్పందించే ఆయన.. మరికొన్ని సందర్భాల్లో తనను ఉద్దేశించి ఎన్ని అన్నా.. మౌనమే సమాధానం అన్నట్లుగా వ్యవహరించటం ఆయనకే చెల్లుతుంది. జూబ్లీ ఉపఎన్నిక ఫలితం వెలువడిన వేళ.. ముఖ్యమంత్రి రేవంత్ మీడియా భేటీని ఏర్పాటు చేయటం.. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆయన్ను ఉద్దేశించి తాను విమర్శలు చేయనని.. ఆయన ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉందని.. రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని.. అలాంటి ఆయన్ను ఉద్దేశించి విమర్శలు చేయకూడదని.. మళ్లీ క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా ఉన్నప్పుడు మాట్లాడతానని చెప్పిన వైనం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యల్ని చూస్తే.. కేసీఆర్ వాలంటరీ రిటైర్మంట్ తీసుకున్న రీతిలో ఆయన మాట్లాడినట్లుగా సామాన్యులకు అర్థమయ్యే పరిస్థితి. సీఎం ప్రస్తావించిన అంశాల్లో రెండు ముఖ్యమైనవి. ఒకటి.. కేసీఆర్ ఆరోగ్యం బాగోలేదని.. రెండోది.. ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారన్నది.
రాష్ట్ర ముఖ్యమంత్రి నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలకు బదులుగా కేసీఆర్ మీడియా ముందుకువస్తారని.. తాను ఆరోగ్యంగా ఉన్న విషయాన్ని.. రాజకీయాలకు దూరం కాలేదన్న మాట చెబుతారని కొందరు భావించారు. అందుకు భిన్నంగా తన స్పందనను మౌనంతో ఎదుర్కొనే కేసీఆర్ ప్రయత్నం ఇప్పుడు గులాబీ పార్టీలోనూ హాట్ టాపిక్ గా మారింది. రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉంటానన్న విషయాన్నిఏ రాజకీయ పార్టీ అధినేత అయినా చెప్పుకోవచ్చు. ఒకవేళ బహిరంగంగా చెప్పటం ఇష్టం లేకపోతే గమ్మున ఉండొచ్చు. అయితే.. ముఖ్యమంత్రే స్వయంగా తన ఆరోగ్యంపై వ్యాఖ్యలు చేసినప్పుడు.. స్పందించకుండా ఉంటే.. పార్టీ క్యాడర్ లో కొత్త అనుమానాలకు తావిచ్చినట్లు అవుతుంది.
ఏ కారణంగా కేసీఆర్ గమ్మున ఉన్నారో.. ముఖ్యమంత్రి వ్యాఖ్యల తర్వాత కూడా అదే మౌనాన్ని కంటిన్యూ చేస్తే.. పార్టీకి కలిగే నష్టం పెద్దదన్న విషయాన్ని కేసీఆర్ మిస్ అయినట్లుగా కనిపిస్తోంది. అధికార పక్షానికి ధీటుగా విపక్షం ఉండాల్సిన అవసరం ఉంది. తన బాధ్యతను తన కొడుకు.. మేనల్లుడి మీద పెట్టటం బాగానే ఉన్నా.. తన కూమార్తె అందుకు భిన్నమైన దారిలో నడుస్తున్న వేళ.. కేసీఆర్ బయటకు రావాల్సిన అవసరం ఉంది. కానీ.. ఈ విషయంలో ఆయన వ్యవహరిస్తున్న తీరు కొత్త చర్చకు తెర తీసిందన్న మాట బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నోట అనధికారికంగా వినిపిస్తోంది. ఇలాంటి వేళ.. ఒక్కసారి కేసీఆర్ బయటకు రావాల్సిందేనని.. రాకుంటే ముఖ్యమంత్రి రేవంత్ చెప్పిన మాటే ప్రజలు నిజమని నమ్మటం ఖాయమని గులాబీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి వేళ కేసీఆర్ ఏం చేస్తారో చూడాలి.
Tags: revanthreddy kcrhealth politicalnews brs telanganaupdates congress
