అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ హెచ్–1బీ వీసాలకు మద్దతు ప్రకటించడం అమెరికా రాజకీయాల్లో పెద్ద చర్చను లేవనెత్తింది. ఒక వైపు ఆయన విదేశీ కార్మికులు అవసరమని చెప్తూ.. మరోవైపు రిపబ్లికన్ పార్టీ లోపల నుంచే హెచ్–1బీ పూర్తిగా రద్దు చేయాలని ఒత్తిడి పెరుగుతోంది. ఇది కేవలం ఆర్థిక, రాజకీయ పోరాటం మాత్రమే కాదు.. అమెరికాలో లక్షలాది భారతీయుల భవిష్యత్తుకు కూడా ఇది కీలకం. ట్రంప్ వ్యాఖ్యల్లో ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అమెరికా చిప్ తయారీ, మిసైల్ టెక్నాలజీ, ఇతర అధునాతన రంగాల్లో అవసరమైన నైపుణ్యాల కోసం స్థానికులు మాత్రమే సరిపోరని ఆయన అనుకుంటున్నట్లు ఉంది. ‘ఉద్యోగం లేని వ్యక్తిని తీసుకొని నేరుగా మిసైల్ ఫ్యాక్టరీలో పెట్టలేం’ అని ఆయన చెప్పడం.. ఈ రంగాల్లో తక్షణ నైపుణ్యం దేశంలో తక్కువగా ఉన్నదనే వాస్తవాన్ని సూచిస్తోంది. అమెరికా చిప్ తయారీని తిరిగి నిలబెట్టుకోవడానికి విదేశీ నిపుణులు తప్పనిసరి కావాలని ఆయన భావిస్తున్నారు.
రిపబ్లికన్ లో వ్యతిరేకత
ఈ వ్యాఖ్యలు రిపబ్లికన్ వర్గంలో తీవ్రమైన వ్యతిరేకతను రేపాయి. ఏళ్లుగా హెచ్–1బీ కార్యక్రమాన్ని ‘అమెరికన్ ఉద్యోగాలను దోచుకునే వ్యవస్థ’గా ప్రచారం చేస్తున్న వర్గాలకు ట్రంప్ మాటలు నచ్చలేదు. ముఖ్యంగా మార్జోరీ టేలర్ గ్రీన్, ఆండీ ఓగ్లెస్ వంటి తీవ్రవాద నేతలు హెచ్–1బీని పూర్తిగా నిషేధించే బిల్లులు తెస్తామని ప్రకటించారు కూడా. కానీ వైట్‌హౌస్ మాత్రం మరో కోణంలో ఆలోచిస్తుంది. హెచ్-1బీ వ్యవస్థలో దుర్వినియోగాన్ని నిలిపివేయడం కోసం దరఖాస్తు ఫీజును $100,000కి పెంచడం, ‘ప్రాజెక్ట్ ఫైర్‌వాల్’ ద్వారా హెచ్–1బీ దుర్వినియోగం చేసే సంస్థలపై దర్యాప్తులు ప్రారంభించడం.. ఇవన్నీ వీసాను పూర్తిగా రద్దు చేయడమే లక్ష్యం కాదని, దుర్వినియోగాన్ని ఆపి, అత్యున్నత నైపుణ్యం ఉన్నవారినే దేశంలోకి తీసుకురావడమే లక్ష్యమని వైట్ హౌస్ స్పష్టం చెప్తూ వస్తోంది.
గందరగోళం మధ్య నలుగుతున్న భారతీయులు..
అమెరికా రాజకీయాల్లో జరుగుతున్న ఈ గందరగోళానికి మధ్య భారతీయులు నలుగుతున్నారు. 2024లో మొత్తం మంజూరైన హెచ్–1బీ వీసాల్లో 70%కు పైగా భారతీయులే. అంటే అమెరికా టెక్ వ్యవస్థకు భారత్ అందిస్తున్న మేధస్సు, నైపుణ్యం ఎంత కీలకమో గణాంకాలు చెబుతున్నాయి. ఇదే కారణంగా ఇటీవల ఐదుగురు అమెరికా కాంగ్రెస్ సభ్యులు ట్రంప్‌కు లేఖ రాసి, ఈ వీసాలపై కఠిన మైన చర్యలు తీసుకుంటే అమెరికా–ఇండియా సంబంధాలపై ప్రభావం ఉంటుందని హెచ్చరించారు.
అమెరికా-ఇండియాకు మధ్య గుండెకాయ..
హెచ్–1బీ వీసా అమెరికా–ఇండియా మధ్య ఆర్థిక సహకారానికి గుండెకాయలా పనిచేస్తోంది. గూగుల్ నుంచి మైక్రోసాఫ్ట్ వరకు, వేలాది సంస్థలు భారతీయ ఇంజినీర్లపైనే ప్రధానంగా ఆధారపడుతున్నాయి. దీనిని ఒక్కరోజులో రద్దు చేయమని రాజకీయ నాయకులు చెప్పడం సులువుగానే కనిపిస్తుంది. కానీ అది అమెరికా ఆర్థిక వ్యవస్థను ప్రమాదంలోకి నెడుతుంది.
మరోసారి మద్దుతిస్తున్న ట్రంప్..
అందుకే ట్రంప్ మళ్లీ మళ్లీ ఈ వీసాలకు మద్దతిస్తున్నారు. అది అమెరికా ఆర్థిక వ్యవస్థకు అవసరం. అయితే, ఇదే సమయంలో అతని పార్టీ నాయకులే దీన్ని రద్దు చేయాలని గట్టిగా కోరుతున్న పరిస్థితి.. రాబోయే నెలలు అమెరికా ప్రవాస విధానానికి నిర్ణయం తీసుకోనుంది. ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏమిటంటే.. అమెరికా నిజంగా నైపుణ్యం కోసం ప్రపంచాన్ని ఆదుకుంటుందా..? లేదా రాజకీయ ఒత్తిడితో తలుపులు మూస్తుందా..? దీనికి సమాధానం భారత్‌లో లక్షలాది కుటుంబాల భవిష్యత్తును నిర్ణయిస్తుంది.
Tags: h1bvisas trump indiantechies usimmigration republicandebate h1bvisa trumpsupport skilledworkers uspolitics usanews
