ఏపీలో పోలింగ్ ముగిసిన అనంతరం టిడిపి నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సిఎం చంద్రబాబు… తమ తెలుగుదేశమే నూటికి నూరు శాతం తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రాథమిక సమాచారం (బేసిక్ రిపోర్ట్) ప్రకారం 130 స్థానాల్లో టిడిపి గెలుస్తుందని, ఇందులో రెండో ఆలోచనే లేదని తేల్చి చెప్పారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
అర్ధరాత్రి వరకు పోలింగ్ బూత్‌లలో విధులు నిర్వహించిన ఏజెంట్లకు అభినందనలు తెలిపిన ఆయన… కౌంటింగ్ వరకు ఇదే పోరాట పటిమ కొనసాగించాలని సూచించారు. మే 23వ తేదీ వరకూ స్ట్రాంగ్ రూంల వద్ద షిఫ్టుల వారీగా కాపలా కాయాలని, ఫలితాల వరకు పూర్తి అప్రమత్తంగా ఉండాలని జాగ్రత్తలు చెప్పారు. ఓడిపోతున్నామనే భయంతోనే వైసిపి పలుచోట్ల విధ్వంసాలకు పాల్పడిందని, ఇది వారి దిగజారుడుతనానికి ప్రత్యక్ష నిదర్శనమని చంద్రబాబు మండిపడ్డారు.
అర్ధరాత్రి 12గంటల వరకు 200 బూత్‌లలో పోలింగ్ సాగిందని… మహిళలు, ఇతరులు ఇబ్బంది పడాలనే వైసిపి ఈ పరిస్థితి కల్పించిందని ఆరోపించారు. కార్యకర్తలు, ప్రజలే ఓటింగ్ సరళిని కాపాడారని… ఎవరెన్ని కుట్రలు పన్నినా, అడ్డంకులు సృష్టించాలని చూసినా ప్రజలు తెలుగుదేశం పక్షాన నిలిచారని చంద్రబాబు అన్నారు.



కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి