'జక్కన్' శిష్యులు...అరడజను అపజయాలు!






బాహుబలి తర్వాత దర్శక ధీరుడు రాజమౌళికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ చిత్రంతో జక్కన్న...ఇండియన్ సినిమా స్టామినాను ప్రపంచానికి తెలియజేశాడు. ఏ గురువుకైనా తమ శిష్యులు రాణించినపుడే గొప్ప పేరు వస్తుంది. అయితే రాజమౌళికి మాత్రం ఈ విషయంలో నిరాశే ఎదురవుతోంది. జక్కన్న దగ్గర అసిస్టెంట్లుగా పనిచేసినవారు మాత్రం తమ గురువు పేరు నిలబెట్టలేకపోతున్నారు. రాజమౌళి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేసిన వారు డైరెక్టర్లుగా మారి తీసిన 6 సినిమాలు డిజాస్టర్లయ్యాయి. ఈ విషయం రాజమౌళిని కలవరపెడుతోంది. తాజాగా రాజమౌళి శిష్యుడు పళని దర్శకత్వం వహించిన ఏంజెల్ చిత్రం మిక్సీడ్  టాక్ ను సొంతం చేసుకుంది.







ప్రతిష్టాత్మక బాహుబలి చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన పళని...సోషియో ఫాంటసీ నేపథ్యంలో ఏంజెల్ ను తెరకెక్కించాడు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గరఅంత గొప్పగా లేదు . హెబ్బా  పటేల్ లీడ్ రోల్  పోషించిన ఏంజెల్ చిత్రం మిక్సీడ్  టాక్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం కష్టం అని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతంలో కూడా రాజమౌళి శిష్యులు తీసిన కొన్ని సినిమాలు అపజయాన్ని మూటగట్టుకున్నాయి. వి. విజయేంద్రప్రసాద్ కథను అందించిన జాగ్వార్ చిత్రానికి రాజమౌళి అసిస్టెంట్ మహదేవన్ తెరకెక్కించాడు. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ ఆ సినిమాతో తెరంగేట్రం చేశాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆ సినిమా గత ఏడాది విడుదలై భారీ డిజాస్టర్ గా మిగిలింది. అదేవిధంగా జక్కన్న అసిస్టెంట్లు....జగదీశ్ తలశిల(లచ్చిందేవికి ఓ లెక్కుంది) త్రికోటి(దిక్కులు చూడకు రామయ్య) డీఎస్ కణ్ణన్(సారాయి వీర్రాజు) కరుణ కుమార్(ద్రోణ) వంటి యువ దర్శకుల తొలి చిత్రాలు భారీ డిజాస్టర్ లు కావడం రాజమౌళిని కలవరపెడుతోంది. మరి రాబోయే కాలంలో జక్కన్న పేరును నిలబెట్టేలా ఆయన శిష్యులు భారీ హిట్ చిత్రాన్ని తెరకెక్కించి గురుదక్షిణ చెల్లిస్తారేమో వేచి చూడాలి!