ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులతో పాటు, ఇండస్ట్రీ వర్గాలలో కూడా అత్యంత ఆసక్తిని రేకెత్తించిన మురుగదాస్ “స్పైడర్” సినిమా ‘ఫస్ట్ లుక్’ అంచనాలను అందుకోవడంలో విఫలమైందన్న విషయం తెలిసిందే. ఏదో ఒక కార్పొరేట్ కంపెనీని యాడ్ ఇస్తున్నట్లుగా ‘స్పైడర్’ స్టిల్స్ ఉన్నాయన్న కామెంట్స్ విరివిగా వినిపించాయి. అలాగే ‘స్పైడర్’ టైటిల్ యొక్క థీమ్ ను అయినా ప్రతిబింబిస్తుందని భావించగా, అది కూడా సింపుల్ గా ప్రజెంట్ చేసి సినిమాపై ఉన్న హైప్ ను తగ్గించడంలో సక్సెస్ సాధించింది చిత్ర యూనిట్. ‘స్పైడర్’ తర్వాత ఆ రేంజ్ లో ‘ఫస్ట్ లుక్’పై అంచనాలు ఏర్పడ్డ సినిమాగా జూనియర్ ఎన్టీఆర్ “జై లవకుశ” నమోదైంది. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు విభిన్న పాత్రలలో నటిస్తున్న నేపధ్యంలో ఒక పాత్రలో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ గెటప్ అదిరిపోతుందన్న టాక్ కు తోడూ, ఇటీవల ఓ డిఫరెంట్ గెటప్ లో ఎన్టీఆర్ మాస్క్ లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. దీంతో “జై లవకుశ” ఫస్ట్ లుక్ విభిన్నంగా ఉండే ఎన్టీఆర్ పాత్రతో విడుదల అవుతుందా? అన్న ఆసక్తి నెలకొంది. ఈ సినిమా స్క్రిప్ట్ కు సంబంధించి పలువురు సినీ ప్రముఖులు కూడా ‘అదిరిపోతుందన్న’ సంకేతాలు ఇవ్వడంతో, ఈ ఏడాది సెకండాఫ్ లో విడుదల కానున్న క్రేజీ ప్రాజెక్ట్ గా “జై లవకుశ” రూపుదాల్చుకుంది. మరి అంతే క్రేజ్ ను కొనసాగించాలంటే, ‘స్పైడర్’ మాదిరి కాకుండా ‘ఫస్ట్ లుక్’తోనే ప్రేక్షకులను పడేయాలి. మరి దానికి వేదిక జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం అయిన మే 19వ తేదీ వరకు వేచిచూడాల్సిందే! ఫస్ట్ లుక్ పై వచ్చిన క్లారిటీ, ఇంకా ట్రైలర్, టీజర్ మరియు సినిమా విడుదల తేదీ తదితర అంశాలలో రావాల్సి ఉంది.