ఎన్టీఆర్ కొంత కాలంగా తనలోని నటుడిని కొత్తగా ఆవిష్కరించే కథల్నే ఎంచుకొంటున్నారు. ప్రస్తుతం చేస్తున్న ‘జై లవకుశ’ కూడా అందులో భాగమే. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. రాశీ ఖన్నా, నివేదా థామస్ కథానాయికలు.
ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో ఎన్టీఆర్, రాశీ ఖన్నాలతో పాటు ఇతర ప్రధాన తారాగణంపై కీలకమైన టాకీ సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులోని ఓ పాత్రలో ఎన్టీఆర్ లవకుమార్ అనే ఓ ప్రభుత్వ ఉద్యోగి పాత్రలో సందడి చేస్తారని సమాచారం. మరో పాత్రలో ఓ ప్రత్యేకమైన వేషధారణతో కనిపించనున్నారు.
ఆ పాత్ర కోసం విదేశీ సాంకేతిక నిపుణుల సహాయం కూడా తీసుకొంటున్నారు. మిగిలిన ఆ మూడో పాత్ర ఏంటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇటీవలే టైటిల్ లోగోని విడుదల చేశారు. ఆ లోగోతోనే చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలు ఎలా ఉండబోతున్నాయో చూచాయగా సంకేతాలు పంపారు. మే నెలలో గుజరాత్‌లో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించబోతున్నట్టు చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.
బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న కొత్త సినిమా ‘జై లవ కుశ’ షూటింగ్ లో భాగంగా ఎన్టీఆర్ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇందులో ఒక కథానాయికగా నటిస్తున్న రాశి ఖన్నాతో ఎన్టీఆర్ పెళ్లి జరగనుంది. ఇందుకు చిలుకూరు బాలాజీ టెంపుల్ ను వేదికగా చేసుకున్నారు. ఇక్కడి దేవాలయం షూటింగులకు కూడా ప్రసిద్ధి. తరచుగా అక్కడ తెలుగు సినిమాల షూటింగ్ జరుగుతూ ఉంటుంది. సిటీకి దూరంగా ఏ హడావుడి లేకుండా షూటింగ్ చేసుకోవడానికి వీలుంటుంది ఇక్కడ.
ఆలయం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు చేయడానికి చిలుకూరు దేవాలయాన్ని మంచి వేదికగా భావిస్తారు సినిమా వాళ్లు. ఇప్పుడక్కడ ‘జై లవ కుశ’లోని పెళ్లి సన్నివేశం తీస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఓ పాత్రకు రాశి జోడీగా నటిస్తోంది. మరో పాత్రకు నివేదా థామస్ కథానాయిక. మూడో పాత్రకు హీరోయిన్ ఉందా లేదా అన్నది క్లారిటీ లేదు. ఇప్పటికే ఈ చిత్రం దాదాపు యాభై శాతం షూటింగ్ పూర్తి చేసుకుందని సమాచారం. ఈ సినిమాలో ‘పెళ్లిచూపులు’ ఫేమ్ ప్రియదర్శి హీరో ఫ్రెండుగా ఓ కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. ఎన్టీఆర్ అన్నయ్య కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబరులో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
