‘ఉయ్యాలవాడ..’ కథను వక్రీకరిస్తున్న చిరంజీవి టీమ్?


చారిత్రాత్మక నేపథ్యం ఉన్న సినిమాలను తమకు తోచినట్టుగా తీసుకొంటూ పోవడం సినిమా వాళ్లకు కొత్తేమీ కాదు. దాదాపుగా ప్రతి సినిమా విషయంలోనూ ఇలాగే జరుగుతోంది. చరిత్రను చరిత్రలా చూపే సినిమాలు ఏవీ లేవు. వక్రీకరణలే ఎక్కువ. ఇటీవలే వచ్చిన ‘గౌతమి పుత్రశాతకర్ణి’ సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. ఆ సినిమాలో చూపిన దానికి, శాతకర్ణి చరిత్రకు అసలేం సంబంధం లేదని చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. చాలా విమర్శలే వచ్చాయి.
ఇక చూస్తుంటే.. చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఉయ్యాలవాడ..’ సినిమాలో కూడా చరిత్రను వక్రీకరించనున్నారనే అభిప్రాయం కలుగుతోంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లను పెట్టనున్నారని, ముక్కోణపు ప్రేమకథగా ఈ సినిమాను తీస్తారని, అలాగే చిరంజీవి ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తాడని.. ఇలా రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. మరి ఇవన్నీ నిజం అయితే మాత్రం నిస్సందేహంగా చరిత్రను వక్రీకరించే ప్రయత్నం జరుగుతున్నట్టే.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.. పాలెగాడి హోదాలో ఉండిన వ్యక్తి. బ్రిటీషర్లకు ఎదురుతిరిగి స్వతంత్ర సమరయోధుడిగా నిలిచాడు. విప్లవవీరుడిగా ఆత్మార్పణ చేశాడు. ఆయన కథ రాయలసీమ ప్రాంతంలో కొన్ని తెగల వారు పాటలుగా పాడతారు. అందులో.. ముక్కోణపు ప్రేమకథలేమీ ఉండవు. అయితే  సినిమాలో మాత్రం ఇవన్నీ చూపనున్నారట. అడ్డుకునే వారెవరూ లేరు కదా.. అందుకే ఈ తెగింపు.

కామెంట్‌లు