టెంపర్ సినిమా నుంచీ కూడా తన సినిమాల ప్లానింగ్ మొత్తం మార్చేశాడు తారక్. చాలా కొత్తగా ఆలోచిస్తున్నాడు. ఆలోచనల్లో కూడా పూర్తి క్లారిటీతో ఉంటున్నాడు. ఎన్టీఆర్ పర్సనల్ లైఫ్‌లో కూడా టెంపర్ సినిమా టైం నుంచే చాలా మార్పులు వస్తూ ఉన్నాయి. అంతా కూడా భార్య ప్రణతి ప్రభావం అని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. మొత్తం నందమూరి ఫ్యామిలీని కలుపుకుపోయే ప్రయత్నంలో అడ్డంకులు ఎదురైనప్పటికీ హరికృష్ణ ఫ్యామిలీతో మాత్రం పూర్తిగా కలిసిపోయాడు తారక్.
ఇప్పుడిక తాత నందమూరి తారక రామారావు బేనర్ అయిన ఎన్టీఆర్ ఆర్ట్స్‌ని నిలబెట్టే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ సినిమా లోగో లాంఛ్ కోసం ఎన్టీఆర్ ఎంచుకున్న డేట్, టైం ఇప్పుడు సెన్సేషన్ అవుతోంది. స్వర్గీయ నందమూరి తారక రామారావుకు ఉన్న రాముడిసెంటిమెంట్ గురించి కొత్తగా చెప్పేదేముంది? ఈ విషయంలో తారక్‌కి కూడా సేం సెంటిమెంట్ ఉందట. అందుకే ఏరి కోరి మరీ బాలల రామాయణం సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు తన 27వ సినిమా టైటిల్ లోగో రిలీజ్ కార్యక్రమాన్ని కూడా రాముడి సెంటిమెంట్‌తో ఏప్రిల్ 5వ తేదీన ఉదయం పది గంటల ముఫ్ఫై నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు. ఇప్పుడు ఈ ముహూర్తం గురించే సినిమా ఇండస్ట్రీలో చర్చోపచర్చలు నడుస్తున్నాయి. స్వర్గీయ ఎన్టీఆర్ కూడా తన సినిమాల ముహూర్తాలు శ్రీరామనవమికి వచ్చేలా చాలా సార్లు ప్లాన్ చేశాడు. ఇప్పుడు తాత బాటలోనే మనవడు కూడా నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆలోచను, అభిరుచుల విషయంలో మాత్రం తాతకు తగ్గ మనవడే అనిపిస్తున్నాడు ఎన్టీఆర్. అయినా ఆ తారక రాముడి సెంటిమెంట్‌ని ఉపయోగించుకునే విషయంలో ఎన్టీఆర్ కంటే అర్హత ఉన్నవాళ్ళు ఎవరున్నారు?
