యూ ట్యూబ్ లో “బాహుబలి 2” సృష్టించిన సంచలన రికార్డుల గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటివరకు ఉన్న ఇండియన్ ఫిల్మ్ రికార్డులను తిరగరాసిన “బాహుబలి 2” వెనుక ఒక అదృశ్య శక్తి ఉందని కొత్తగా ఓ వార్త పుట్టుకొచ్చింది. మరే భారతీయ సినిమాకు సాధ్యం కాని రీతిలో 24 గంటల్లోనే 5 కోట్లకు పైగా వ్యూస్ ను సాధించిన “బాహుబలి 2” ట్రైలర్, ప్రపంచంలో ఇప్పటి వరకు అధ్యధిక లైక్స్ సాధించిన ‘అవెంజర్స్: ఏజ్ ఆఫ్ అల్ట్రాన్స్’ను మించిపోయింది.
అవెంజర్స్ కు మొత్తమ్మీద 5.16 లక్షల లైక్స్ రాగా… బాహుబలి-2 ట్రైలర్ కేవలం 24 గంటల్లోనే ఈ రికార్డును బద్దలు కొట్టి, 5.57 లక్షల లైక్స్ సాధించి హాలీవుడ్ సినిమాలకు సైతం సవాల్ విసిరింది. అయితే ‘బాహుబలి’కి ఈ రేంజ్ లో వ్యూస్, లైక్స్ దక్కడంపై రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఉన్నారని, జియో ఫ్రీ డేటా ఆఫర్ ఉండడం వలనే, ఇది సాధ్యమైందని, ‘బాహుబలి 2’ ట్రైలర్ ను జనాలు అన్ని సార్లు చూశారని తెరపైకి వచ్చిన కొత్త వాదన మరీ కామెడీగా ఉంటోంది.
ఈ వాదనలో కొంత లాజిక్ ఉండవచ్చు గానీ, అదే నిజమైతే ఒక తెలుగు సినిమా కంటే ఎక్కువ మార్కెట్ పరిధి కలిగిన బాలీవుడ్ సినిమాలకు ఎందుకు ఆ రేంజ్ లో క్లిక్స్ రాలేకపోయాయి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. బహుశా ఒక తెలుగు సినిమా ఈ రేంజ్ లో హంగామా చేయడం రుచించని కొంతమంది సృష్టించిన పుకారుగానే దీనిని భావించాలి తప్ప, ఇందులో నిజంగా వాస్తవం ఉంటే ఒక్కసారి గత ఆరు నెలలుగా విడుదలైన బాలీవుడ్ సినిమాల ట్రైలర్ల జాబితాను పరిశీలించాలి.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి