“పవన్ కళ్యాణ్” చుట్టూ “మాఫియా” ఉంది!


గతేడాది సమ్మర్లో విడుదలై, “సర్ధార్ గబ్బర్ సింగ్” బాక్సాఫీస్ వద్ద దారుణ పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. భారీ నష్టాలను తీసుకువచ్చిన ఈ సినిమా పంపిణీదారులలో, తాజాగా కృష్ణాజిల్లాకు పంపిణీ చేసిన సంపత్ కుమార్ బయటకు వచ్చి ఓ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసారు. ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ను తానూ 4.50 లక్షల రూపాయలకు సినిమాను కొనుగోలు చేసానని, 4.38 లక్షలు కట్టాను గానీ, ఒక 3 శాతం మాత్రం అప్పుడున్న కొన్ని కారణాల వలన కట్టలేకపోయాయని అన్నారు.

ఇక, ఈ సినిమా మొత్తంగా 2.52 కోట్లు షేర్ వసూలు చేసిందని, 1.80 కోట్లు నష్టం వచ్చిందని తెలిపారు. ఇంత భారీ స్థాయిలో నష్టాలు రావడంతో పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించి, ఈ సినిమా నష్టపోయిన వారి కోసం మరో సినిమా చేస్తానని చెప్పి, ‘కాటమరాయుడు’ ప్రారంభించారని అన్నారు. ఈ విషయాన్ని అప్పుడే చెప్పారని, అలాగే ఈ సినిమా ప్రారంభమైన తర్వాత పవన్ కళ్యాణ్ మేనేజర్ శ్రీనివాస్ గారిని కలిసినపుడు… ‘సినిమా స్టార్ట్ చేసాం కదా… రిలీజ్ కు ముందు ఒకసారి కలిసి అమౌంట్స్ మాట్లాడుకుందాం… కళ్యాణ్ గారి మీ కోసమే ఈ సినిమా స్టార్ట్ చేసారు’ అని తమతో చెప్పినట్లుగా తెలిపారు సంపత్.

అయితే జనవరి చివరి వారంలో వారికి అనుకూలంగా ఉండే వారికి ఇచ్చేసారని, తనకు మాత్రం ‘మీరు మా సినిమా కొనలేదు, ఈరోస్ దగ్గర కొన్నారు, వారిని అడగండి అని చెప్తున్నారని,’ నిజానికి ఆ రోజు నిర్మాత శరత్ మరార్ ఆఫీసులో వారు చెప్తేనే ఈరోస్ తో ఒప్పందాలు కుదుర్చుకున్నామని, అంతేతప్ప తమకు అసలు ఈరోస్ అంటే ఎవరో తెలియదని అన్నారు. తనకు దాదాపుగా 2 కోట్ల రూపాయలు నష్టం రాగా, నైజాం పంపిణీదారునికి 8 కోట్ల మేర నష్టం వచ్చిందని, మిగతా ఏరియాలైన గుంటూరు, ఈస్ట్, వెస్ట్, సీడెడ్ లలో పెద్దగా నష్టం రాలేదని, వారికి గ్యారెంటీలు ఉన్నాయని అన్నారు.

కృష్ణా, నైజాం, నెల్లూరు ఏరియాలలో మినహా మిగతా ప్రాంతాలలో ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ డిస్ట్రిబ్యూటర్లకే సినిమాను ఇచ్చారని, తాము ఫోన్లు చేస్తుంటే కళ్యాణ్ గారి మేనేజర్ శ్రీనివాస్ గారు గానీ, నిర్మాత శరత్ మరార్ గానీ సమాధానాలు ఇవ్వడం లేదని, మెస్సేజ్ లు చేస్తున్నా స్పందన లేదని, మరో పక్కన పవన్ కళ్యాణ్ గారిని కలుద్దామంటే, ఆయన చుట్టూ ఉన్న మాఫియా కలవనివ్వడం లేదని, సినిమా ఆఫీస్ కు ఆయన రావడం లేదని, పార్టీ ఆఫీస్ కు వెళ్తే ఇక్కడ పార్టీ విషయాలు తప్ప ఏమీ చర్చించరని చెప్తున్నారని, ఈ విషయం కళ్యాణ్ గారి దృష్టికి తీసుకురావడానికే తానూ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసానని తెలిపారు.

ఈ విషయం మా దృష్టికి తీసుకురాగా, వారు మేనేజర్ శ్రీనివాస్ తో మాట్లాడగా, ‘నా అంతు చూస్తానని చెప్తూ అసభ్యకరంగా మాట్లాడారని, ఆవేదనతో తాము వెళ్తే మా అంతు చూస్తామంటున్నారని, అదే జరిగితే అభిమానులకు అండగా ఉండే పవన్ కళ్యాణ్ అస్సలు ఊరుకోరని, ఆయనే చూసుకుంటారని’ అన్నారు. మీరు నష్టాల్లో ఉన్నారు, మీరు డబ్బులు కట్టలేరు అనే కారణాలు చెప్పడం ఎంతవరకు సమంజసమని, నష్టం వచ్చింది ఎవరి వలనో ఆలోచించాలని, ఒక డిస్ట్రిబ్యూటర్ కు 2 కోట్ల మేర నష్టం అంటే అది ఆత్మహత్యకు దారి తీసే విషయమని తన ఆవేదనను ప్రెస్ మీట్ ద్వారా తెలియజేసారు.

కామెంట్‌లు