మన తెలుగు సినిమాలలో ‘హీరోయిజం’ చూస్తుంటే జుగుప్స కలుగక మానదు. ఇప్పటికే అభిమానులు ‘దైవం’గా నెత్తిన పెట్టుకుని పూజిస్తుంటే, ఆ అంచనాలను రీచ్ అయ్యేందుకు ఈ హీరోలు పడుతున్న పాట్లు అన్ని ఇన్ని కావు. మన తెలుగు సినిమా హీరోలు కొడితే గోడలు బద్దలైపోతాయి.., పిల్లర్లు విరిగిపోతాయి.., ఇనుప చువ్వలు వొంగిపోతాయి… ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ప్రపంచంలో మన తెలుగు సినిమా హీరో చేయని పనంటూ ఉండదని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
తాజాగా విడుదలైన “కాటమరాయుడు” సినిమాలో చూపించిన ‘హీరోయిజం’ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. రైలులో ఉన్న వ్యక్తిని పవన్ కొడితే డోర్ తో సహా ఊడిపడడం చూస్తే… బాబోయ్… ఎన్నాళ్ళు ఈ బీభత్సకరమైన దృశ్యాలు చూడాలి అన్న అనుభూతి కలుగక మానదు. అభిమానులకు తమ అభిమాన హీరో ఏం చేసినా బాగానే ఉంటుంది గానీ, సాధారణ ప్రేక్షకులు ఇలాంటి ‘ఓవర్ డోస్’ యాక్షన్ సీన్లను చూస్తే చీదరించుకుంటున్నారన్న సంగతిని సదరు హీరోలు, దర్శకులు, ఫైట్ మాస్టర్లు గుర్తించలేకపోవడమే మరీ విడ్డూరం.
ఇందుకు ‘కాటమరాయుడు’లో చూపించిన షాట్లు ఒక్కటే పరిమితం కాదు. టాలీవుడ్ లో ప్రస్తుతం చలామణి అవుతోన్న చిన్న, పెద్ద హీరోలంతా ఇలాంటి అద్భుతమైన షాట్లలో నటించినవారే. ఒక హీరో తొడకొడితే ఏకంగా ట్రైన్ వెనక్కి పోతే, మరో హీరో రెండు ట్రైన్ల మధ్య నుండి జంప్ చేస్తాడు. ఇంకో హీరో ఏకంగా విమానం నుండి బిల్డింగ్ పైకి దూకేస్తాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి సినిమాలో లెక్కలేనన్ని చెత్త ‘హీరోయిజం’ సీన్లు దర్శనమిస్తాయి. అయితే ఇలాంటి ‘ఓవర్ యాక్షన్’ సీన్ల కంటే, రియలిస్టిక్ ఫైట్లకే ప్రేక్షకులు మొగ్గు చూపుతున్నారని ఈ మహామహులంతా ఎప్పటికి తెలుసుకుంటారో ఏమో..! అసలు వీరికి జ్ఞానోదయం అవుతుదంటారా..!?

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి