ఎన్టీఆర్ కోసం హాలీవుడ్ లెజెండ్


ఏమో అనుకున్నాం కానీ.. ఎన్టీఆర్ కొత్త సినిమా వ్యవహారం మామూలుగా లేదు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తాడన్న వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ మూడు పాత్రల్లో వైవిధ్యం చూపించడానికి మేకప్ పరంగా గొప్ప ప్రయత్నమే జరిగేలా ఉంది. ఈ సినిమా కోసం హాలీవుడ్ లెజెండరీ టెక్నీషియన్ ఒకరిని తీసుకోవడం విశేషం. ‘లార్డ్ ఆఫ్ ద రింగ్స్’.. ‘ఐరన్ మ్యాన్’.. ‘లైఫ్ ఆఫ్ పై’ లాంటి సినిమాలకు ప్రోస్థెటిక్ అండ్ లెగసీ ఎఫ్ఎక్స్ నిపుణుడు వాన్స్ హార్ట్ వెల్ సేవల్ని ఎన్టీఆర్ 27వ సినిమాకు ఉపయోగించుకుంటున్నారు. వాన్స్ ఆల్రెడీ హైదరాబాద్ కు వచ్చేసి.. ఎన్టీఆర్ తో కలిసి పని చేస్తున్నాడు కూడా.

ఎన్టీఆర్ తో వాన్స్ కలిసి ఉన్న ఫొటోను ట్విట్టర్లో షేర్ చేస్తూ అతను ఈ సినిమాకు పని చేస్తున్న విషయాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ వెల్లడించింది. వాన్స్ హార్ట్ వెల్ శంకర్ విజువల్ వండర్ ‘రోబో’కు కూడా పని చేయడం విశేషం. ప్రోస్థెటిక్ మేకప్ విషయంలో వాన్స్ చెయ్యి తిరిగిన వాడు. నటుల అవతారాలు మార్చేసి వినూత్నంగా తీర్చిదిద్దడం అతడికి వెన్నతో పెట్టిన విద్య. అతడి సేవల్ని ఉపయోగించుకుంటున్నారంటే ఎన్టీఆర్ ఈ సినిమాలో నెవర్ బిఫోర్ లుక్ లో దర్శనమివ్వబోతున్నట్లే అన్నమాట. ఈ న్యూస్ మన ప్రేక్షకుల్లో ఎగ్జైట్మెంట్ ను పెంచేదే. ఇంకో పది రోజుల్లోనే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లబోతోంది. ఆలోపు ఎన్టీఆర్ లుక్స్ ఫైనలైజ్ అయ్యే అవకాశముంది.

కామెంట్‌లు