చిత్రం: సప్తగిరి ఎక్స్‌ప్రెస్
నటీనటులు: సప్తగిరి.. రోషిణి ప్రకాష్.. అలీ.. షకలక శంకర్.. పోసాని కృష్ణమురళి.. షాయాజీ షిండే.. అజయ్ ఘోష్.. శివప్రసాద్ తదితరులు
సంగీతం: బుల్గానిన్
ఛాయాగ్రహణం: రాంప్రసాద్
కూర్పు: గౌతంరాజు
నిర్మాత: కె.రవికిరణ్
దర్శకత్వం: అరుణ్ పవార్
సంస్థ: సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్
విడుదల: 23-12-2016
హాస్యనటులు హీరోలుగా అవతారం ఎత్తడం తెలుగు చిత్రసీమకు కొత్తమీ కాదు. తాజాగా సప్తగిరి కూడా ఆ జాబితాలో చేరిపోయాడు. ‘పరుగు’, ‘ప్రేమకథా చిత్రమ్’, ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’.. ఇలా పలు చిత్రాల్లో తనదైన విభిన్నమైన వినోదం పండించి ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకొన్న సప్తగిరి.. ఇప్పుడు ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’తో హీరో అయిపోయాడు. మరి నవ్వులూ అదే స్థాయిలో పండించాడా? లేదంటే ‘హీరోయిజం’ కోసం ఆరాటపడ్డాడా? సప్తగిరికి కథానాయకుడిగా ఎన్ని మార్కులు పడతాయి? తెలియాలంటే సమీక్షలోకి వెళ్లాల్సిందే.
కథేంటంటే..: శివ ప్రసాద్ (శివ ప్రసాద్) ఓ నిజాయతీగల కానిస్టేబుల్. తనయుడు సప్తగిరి (సప్తగిరి)ని మాత్రం ఐఏఎస్ చేయాలనుకొంటాడు. కానీ సప్తగిరికి సినిమాలూ, నాటకాలంటే పిచ్చి. సినిమా నటుడవ్వాలని కలలు కంటుంటాడు. తన కాలనీకి కొత్తగా వచ్చిన పూర్ణిమ (రోషిణి ప్రకాష్) వెంట పడుతుంటాడు. ఓ ఎన్‌కౌంటర్‌లో శివప్రసాద్‌ని దారుణంగా చంపేస్తారు. తండ్రి ఉద్యోగం సప్తగిరికి వస్తుంది. తన తండ్రి మరణం వెనుక మనుషులున్నారన్న సంగతి తెలుసుకొన్న సప్తగిరి ఏం చేశాడు? ప్రతీకారం ఎలా తీర్చుకొన్నాడు? అనేదే ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ కథ.
ఎలా ఉందంటే..: తమిళంలో విజయాన్ని అందుకొన్న ‘తిరుడన్ పోలీస్’కి రీమేక్ ఇది. అయితే సప్తగిరి కోసం చాలా మార్పులు చేసినట్టు అర్థమవుతోంది. అల్లరి చిల్లరగా తిరిగే ఓ కుర్రాడు, తన తండ్రి మరణానికి ఎలా ప్రతీకారం తీర్చుకొన్నాడన్నది కథ. మామూలు హీరో అయితే… పగ-ప్రతీకారం అంటూ భారీ డైలాగులు, యాక్షన్ ఛేజింగులతో తీసేద్దురు. కానీ ఇక్కడున్నది సప్తగిరి కావడంతో ఈ ఫార్ములా కాస్త కామెడీ బాట పట్టింది. సప్తగిరి ‘సినిమా పిచ్చి’తో నడిచిన ప్రారంభ సన్నివేశాలు నవ్విస్తాయి. కాలనీలో ప్రేమకథ కూడా ఓకే అనిపిస్తుంది. మరో వైపు తండ్రీ-కొడుకుల మధ్య భావోద్వేగ సన్నివేశాలు వస్తుంటాయి. సింగిల్ టేక్‌లో దానవీర శూరకర్ణ డైలాగ్ చెప్పడం ఆకట్టుకొంటుంది. కానిస్టేబుల్ అయిన తర్వాత సప్తగిరి పడే కష్టాలు, తండ్రిని గుర్తు చేసుకొంటూ ఎమోషన్‌కి గురైన సందర్భాలు ఆకట్టుకొనేవే. పతాక సన్నివేశాలు కూడా నచ్చుతాయి. కానీ.. రివేంజ్ డ్రామా మాత్రం అతకలేదు. దాన్ని మరీ కామెడీ చేశారు. అంతర్లీనంగా ఓ సీరియస్ విషయం ఉన్నా.. దాన్ని సప్తగిరి కోసం కామెడీగా మార్చేయడంతో కథలో సీరియస్‌నెస్ తగ్గింది.
ఎవరెలా చేశారంటే..: ‘నేను అన్నీ చేయగలను’ అని నిరూపించుకోవడానికి సప్తగిరి చేసిన ప్రయత్నంలా అనిపించింది ఈ సినిమా. దానికి తగ్గట్టే వినోదంతో పాటు అన్ని ఎమోషన్లూ చక్కగా పలికించాడు. డాన్సులు చేశాడు.. గాల్లో గింగిరాలు తిరుగుతూ ఫైటింగులు చేశాడు.. హీరోగా పాస్ అయినట్టే. సింగిల్ టేక్‌లో చెప్పిన డైలాగ్ సీన్ బాగా పండించాడు. షకలక శంకర్ పాత్ర నవ్విస్తుంది. హీరో తరవాత అంతటి ప్రాధాన్యం ఉన్న పాత్ర అదే. కథానాయిక అంతంత మాత్రమే. తండ్రిగా శివ ప్రసాద్ ఒదిగిపోయాడు.
చిన్న సినిమా అయినా క్వాలిటీ విషయంలో రాజీ పడలేదు నిర్మాత. అందుకే ప్రతీ సీన్ రిచ్‌గా కనిపిస్తుంది. ఓ మాస్ హీరోకి తగిన పాటలిచ్చాడు సంగీత దర్శకుడు. మాటలు అక్కడక్కడ ఆకట్టుకొంటాయి. కొన్ని పంచ్‌లు పేలాయి కూడా. ద్వితీయార్ధంలో రివేంజ్ డ్రామా విషయంలో దర్శకుడు ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సింది.
బలాలు
+ సప్తగిరి
+ కామెడీ సీన్లు
+ తండ్రీ-కొడుకుల సెంటిమెంట్
బలహీనతలు
– రొటీన్ కథ
– ద్వితీయార్ధం
చివరిగా: ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’.. స్పీడు తక్కువ.. నవ్వులు ఎక్కువ..

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి