సినిమా పేరు: అప్పట్లో ఒకడుండేవాడు
నటీనటులు: నారా రోహిత్.. శ్రీవిష్ణు.. తాన్య హోప్.. బ్రహ్మాజీ.. రాజీవ్ కనకాల.. ప్రభాస్ శీను.. జీవీ.. సత్యదేవ్ తదితరులు
సంగీతం: సాయి కార్తీక్
ఛాయాగ్రహణం: నవీన్ యాదవ్
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాతలు: ప్రశాంతి.. కృష్ణ విజయ్
రచన.. దర్శకత్వం: సాగర్ కె.చంద్ర
సంస్థ: అరుణ్ మీడియా వర్క్స్
విడుదల: 30-12-2016
నవతరం దర్శకులంటే ప్రేమ.. కాలేజీ కథతోనే వస్తారని అనుకోవడం పొరపాటు. వాళ్ల ఆలోచనలూ మారుతున్నాయి. ఓ సీరియస్ విషయాన్ని సిన్సియర్‌గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సమాజం.. అందులోని వ్యక్తులు.. భావోద్వేగాల మధ్య నుంచి కథల్ని అల్లుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమా చూస్తుంటే కొత్త దర్శకుడు సాగర్ కె.చంద్ర కూడా భిన్నమైన ఆలోచనలతోనే వచ్చాడనిపిస్తోంది. టైటిల్‌తోనే కాదు.. ప్రచార చిత్రాలతోనూ కొత్తగా కనిపించిన సాగర్.. వెండి తెరపై ఏం చూపించారు? విడుదలకు ముందు పెంచిన ఆసక్తి సినిమా చూసేటప్పుడు ఏమైందన్నది చూస్తే..
కథేంటంటే..?: 1992నాటి కథ ఇది. అప్పట్లో రైల్వే రాజు (శ్రీవిష్ణు) అని ఒకడుండేవాడు. క్రికెటర్ కావాలన్నది అతని కల. అందుకోసం బాగా ప్రాక్టీస్ చేస్తుంటాడు. అమ్మ.. ఇల్లు.. క్రికెట్ తప్ప మరో ప్రపంచం తెలీదు. నిత్య (తాన్య హోప్)ని ప్రేమిస్తాడు. జాతీయ జట్టులో రైల్వే రాజు స్థానం ఖాయమనుకొంటున్న దశలో.. తన జీవితంలోకి ఇంతియాజ్ (నారా రోహిత్) ప్రవేశిస్తాడు. అతనో నిజాయతీగల పోలీస్. నక్సలైట్లను ఏరి పారేసే పనిలో ఉంటాడు.
ఓ నక్సల్ ముఠాకి సంబంధించిన కీలక సమాచారం రైల్వే రాజు దగ్గర ఉందన్నది అతని అనుమానం. దాంతో.. కటకటాల పాలవుతాడు రాజు. అక్కడ్నుంచి రాజు జీవితమే మారిపోతుంది. ఓ హత్య కేసులోనూ ఇరుక్కుంటాడు. క్రికెటర్ కావాల్సిన రాజు క్రిమినల్ కావాల్సి వస్తుంది. ఆ తర్వాతేం జరిగింది? రైల్వేరాజుకీ ఇంతియాజ్‌కీ జరిగిన పోరాటంలో ఎవరు గెలిచారు? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ఎలా ఉందంటే..?: కథా నేపథ్యం.. దాన్ని చెప్పే తీరును పోలిస్తే.. ఇప్పుడొస్తున్న సినిమాలకు కాస్త భిన్నంగా ఉంటుందీ చిత్రం. ఓ అమ్మాయి రైల్వే రాజు ఫొటో పట్టుకొని అతని గురించి సమాచారం తెలుసుకొనే ప్రయత్నం చేస్తుంటుంది. కాస్త గతం.. ఇంకాస్త వర్తమానం.. ఇలా స్క్రీన్ ప్లే సాగింది. నక్సలైట్ల నేపథ్యం వచ్చే వరకూ కథ.. కథనాలు సాదాసీదాగానే సాగుతాయి.
ఆ తరవాత సినిమా వేగం అందుకుంటుంది. నారా రోహిత్ పాత్ర ప్రవేశించటం.. శ్రీ విష్ణు హత్యా నేరంలో ఇరుక్కోవడం.. ఆరు బంతుల్లో నాలుగు సిక్స్‌లు కొట్టి.. జైలు నుంచి బయటపడడం ఇవన్నీ ఉత్కంఠభరితంగానే సాగుతాయి. రైల్వే రాజు ఎదిగిన తీరు… సినిమాటిక్‌గానే సాగింది.
ద్వితీయార్థంలో చాలాసేపటి వరకూ నారా రోహిత్ పాత్రే కనిపించదు. రైల్వే రాజు – ఇంతియాజ్‌ల పోరాటం కాస్త వన్‌సైడ్ అయిపోతుంది. మళ్లీ ఇంతియాజ్ పాత్ర కనిపించేంత వరకూ కథ.. కథనాల్లో ఎక్కడా ఉత్కంఠత ఉండదు. ఆ ఎపిసోడ్లు బోర్ కొట్టిస్తాయి. మళ్లీ పతాక సన్నివేశాల్లో దర్శకుడు తన మార్క్ చూపించుకోగలిగారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ కథకు పూర్తి న్యాయం క్లైమాక్స్‌లోనే జరిగింది. దర్శకుడు ఈ కథని ముగించిన విధానం ఆకట్టుకుంటుంది.
ఎవరెలా చేశారంటే..?: ఈ సినిమాలో ఇద్దరు హీరోలు ఉన్నా.. ఆ స్థానం శ్రీ విష్ణు ఒక్కడికే దక్కుతుంది. క్రికెటర్ కావాలని కలలుకన్న యువకుడిగా.. అన్యాయంగా ఓ కేసులో ఇరుక్కున్న సామాన్యుడిగా.. రౌడీగా.. ఇలా చాలా రకాల పార్శా్వలు చూపించాడు. పతాక సన్నివేశాల్లో నటన రక్తికట్టించడానికి తన అనుభవం సరిపోలేదు గానీ.. మిగిలిన చోట్ల బాగా రాణించాడు.
నారో రోహిత్ కూడా ఎప్పటిలానే బేస్ వాయిస్‌తో ఆకట్టుకొన్నాడు. చివర్లో వేసిన ముసలి గెటప్ నప్పలేదు. సేటుగా బ్రహ్మాజీ నటన ఆకట్టుకొంది. కథానాయిక చేసిందేం లేదు. శ్రీనివాసరెడ్డి ఒకే ఒక్క కామెడీ ట్రాక్‌లో కనిపించాడు. అదీ సినిమాకి అనవసరమే. కెమెరా ఈ కథ అవసరానికి తగ్గట్టు పని చేసింది. పాటలు కథాగమనానికి అడ్డుకునేలా కనిపిస్తాయి. నేపథ్య సంగీతంతో సన్నివేశం స్థాయిని పెంచేశాడు సంగీత దర్శకుడు. మాటలు మరీ అంత లోతుగా లేకపోయినా.. ఎంత వరకూ వాడాలో అంతే వాడారు.
బలాలు
+ కథా నేపథ్యం
+ పతాక సన్నివేశాలు
+ నేపథ్య సంగీతం
బలహీనతలు
– కథానాయిక
– ద్వితీయార్థంలో తొలి సగం
చివరగా.. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ ఓ సీరియస్ యాక్షన్ డ్రామా!
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి