బాలయ్య వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. బాలయ్య సినీ మజిలీలో ఓ కీలక ఘట్టం పూర్తయ్యింది. ఇక తన తనయుడిని హీరోగా లాంఛ్ చేయడమే నందమూరి బాలకృష్ణకు ఉన్న మరో అతి పెద్ద బాధ్యత. వంద సినిమాలను పూర్తి చేసిన ఆయన ఇప్పుడు మోక్షజ్ఞ ను హీరోగా పరిచయం చేసే సినిమాకోసం కసరత్తు ప్రారంభించారు.
వాస్తవానికి బాలయ్య వందో సినిమా శాతకర్ణిలోనే మోక్షుకు ఓ రోల్ ఉంటుందని ముందు వార్తలు వచ్చాయి. అయితే తర్వాత ఆ వార్తలకు తెరపడింది. ఇక 2017లోనే మోక్షకు డెబ్యూ మూవీ ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాను బాలయ్యకు అత్యంత సన్నిహితుడు, లెజెండ్ డైరెక్టర్ సాయి కొర్రపాటి నిర్మిస్తారని తెలుస్తోంది.
మోక్షు కాల్షీట్లు ఇప్పటికే సాయి కొర్రపాటికి బాలయ్య ఇచ్చేశాడని కూడా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇక ఈ డెబ్యూ మూవీ కోసం బాలయ్య ముగ్గురు దర్శకులను పరిగణనలోకి తీసుకున్నారట. త్రివిక్రమ్, పూరీ, క్రిష్.. వీళ్లు ముగ్గురిలో ఎవరో ఒకరితో మోక్షజ్ఞ తొలి సినిమా పట్టాలెక్కుతుందని సమాచారం. ఈ ముగ్గురు దర్శకులూ మూడు రకాలుగా ప్రత్యేకతను కలిగిన వారే.. మరి బాలయ్య ఎవరి చేతిలో తనయుడిని పెడతాడో చూడాలి.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి