‘జనతా గ్యారేజ్’ విడుదలై రెండు నెలల పైనే అవుతున్నా.. యంగ్‌టైగర్ ఎన్టీఆర్ మాత్రం ఇంతవరకు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. ఇదే సమయంలో ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలని, ఇందుకు 3 నెలల సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నాడని వార్తలొచ్చాయి. దీంతో.. వచ్చే ఏడాదిలోనే ఎన్టీఆర్ 27వ సినిమా ప్రారంభం అవుతుందేమోనన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే.. అందులో వాస్తవం లేదని సమాచారం.
ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న వార్తల ప్రకారం.. ఎన్టీఆర్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌తోపాటు ఆ తర్వాత చేయాల్సిన సినిమాల గురించి కూడా చర్చలు జరుపుతున్నాడట. మొత్తం నాలుగు సినిమాలను వరుసగా ఒకదాని తర్వాత మరొకటి ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాడట. ప్రస్తుతానికి తన తదుపరి చిత్రం అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించడానికి ఎన్టీఆర్ అంగీకరించినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ సెట్స్ మీద ఉండగానే.. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో మరో మూవీని పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడట. అంటే.. ఒకేసారి రెండు సినిమాల షూటింగ్‌లలో పాల్గొనేలా ప్రణాళిక రచిస్తున్నాడట. అంతేకాదు.. మరో రెండు చిత్రాలను కూడా లైన్‌లో పెట్టాడట తారక్. తమిళ దర్శకుడు హరితో, అలాగే పూరీజగన్నాథ్‌తో సినిమాలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడట.
సోషల్ మెసేజ్‌తో కూడిన మంచి కథలను ప్రిపేర్ చేయమని వారికి ఎన్టీఆర్ సూచించాడని.. దాంతో ఇప్పటినుంచే ఆ ఇద్దరూ స్ర్కిప్టును డెవలప్ చేసే పనిలో నిమగ్నమయ్యారని అంటున్నారు. ఈ నాలుగు చిత్రాలను ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా వరుసగా చేయాలని ఎన్టీఆర్ మాస్టర్ ప్లాన్ వేసుకున్నాడని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. ‘గ్యారేజ్’ రిలీజైనప్పటి నుంచి మౌనంగానే ఉంటూ వస్తున్న ఎన్టీఆర్.. వరుసగా నాలుగు సినిమాలను లైన్‌లో పెట్టాడని తెలిసి ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి