జై బాల‌య్య‌… లిమ్కా రికార్డు మ‌న‌దేన‌య్యా


నంద‌మూరి బాల‌కృష్ణ వందో చిత్రం… ‘గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి’ . వంద క‌చ్చితంగా గొప్ప మైలురాయే. ఆ ఘ‌న‌త అందుకొనేట‌ప్పుడు ఎంత జోష్ ఉండాలి?? ఇంకెంత హంగామా చేయాలి..? బాల‌య్య అభిమానుల కోసం ఆ హంగామా రెడీ అవుతోంది. ఇందులో భాగంగా బాల‌య్య అభిమానులు వినూత్న ప్ర‌య‌త్నం చేస్తున్నారు. బాల‌య్య న‌టించిన 99 చిత్రాల్ని వ‌రుస‌గా ఒకే థియేట‌ర్లో ప్ర‌ద‌ర్శించ‌బోతున్నారు.


ప్రొద్దుటూరులోని అర్చ‌న థియేట‌ర్ అందుకు వేదిక అవుతోంది. అర్చ‌న థియేట‌ర్ అంటే బాల‌య్య సినిమాల‌కు అడ్డా. ‘లెజెండ్’ అక్క‌డ ఏకంగా 900 రోజులు విజయవంతంగా ప్రదర్శిస్తున్నారు. అదే థియేట‌రో్ల‌ అక్టోబర్ 5 నుంచి జ‌న‌వ‌రి 11 వ‌ర‌కు బాల‌కృష్ణ న‌టించిన 99 సినిమాల‌ను వ‌రుస‌గా ప్ర‌ద‌ర్శిస్తున్నారు. జ‌న‌వ‌రి 12న బాల‌య్య వందో సినిమా గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి కూడా అదే థియేట‌ర్లో ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతుంది. అంటే ఓ న‌టుడి వంద సినిమాల్ని వ‌రుస‌గా ఒకే థియేట‌ర్లో ప్ర‌ద‌ర్శిస్తార‌న్న‌మాట‌. ఈ ఘ‌ట్టం లిమ్కా బుక్ ఆఫ్ ఇండియ‌న్ రికార్డ్స్‌లో చోటు ద‌క్కించుకోనుంది. అన్న‌ట్టు బాల‌య్య సినిమాల్ని చూడాల‌నుకొంటే టికెట్లు కొన‌క్క‌ర్లెద్దు.. 99 సినిమాలూ ఫ్రీనే. అయితే వందో సినిమా గౌత‌మి పుత్ర శాత‌కర్ణి మాత్రం టికెట్టు కొనే చూడాలి. అక్టోబ‌రు 5న తాత‌మ్మ క‌ల ప్ర‌ద‌ర్శిస్తారు. జ‌న‌వ‌రి 11న డిక్టేట‌ర్ చూడొచ్చు. బాల‌య్య అభిమానులు ఇక అర్చ‌న థియేట‌ర్ ద‌గ్గ‌ర మ‌కాం పెట్టేస్తే బెట‌ర్‌.