ఎన్టీఆర్ టాలీవుడ్ హిస్టరీలో ఒకే ఒక్కడు!!



సినిమా ఇండస్ట్రీలో ఏదైనా ఓ కొత్త సినిమా రిలీజ్ అవ్వగానే కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. ట్రెండ్ మారిపోయింది అని మనవాళ్ళు తెగ రాసేస్తూ ఉంటారు కానీ చాలా తక్కువ సినిమాలు మాత్రమే కేటగిరీలోకి వస్తూ ఉంటాయి. చాలా సార్లు పొగడ్తలుగానే మిగిలిపోతూ ఉంటాయి. మరి ట్రెండ్ క్రియేట్ చేయడం అంటే ఏంటి? ఒక కొత్త హీరోయిజం అంటే ఎలా ఉంటుంది?

జనతా గ్యారేజ్ సక్సెస్ మీట్‌లో చాలా మంది చాలా మాటలు మాట్లాడేశారు. టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ అయితే మాస్ సినిమాలను ఇక నుంచి కొరటాల శివకు ముందు ….కొరటాల శివ తర్వాత అని అంటారని చెప్పుకొచ్చాడు. అది కొంత వరకూ నిజం కూడా. అలాగే స్టార్ హీరోలు కథలో భాగమయ్యే విషయంలో కూడా ఇక నుంచీ ఎన్టీఆర్‌కి ముందు..ఎన్టీఆర్‌కి తర్వాత అని అంటారు. ఇంతకుముందు ఎన్టీఆర్ చేసిన సినిమాల విషయం పక్కన పెడితే జనతా గ్యారేజ్‌లో మాత్రం కంప్లీట్‌గా కొత్తగా కనిపించాడు. కొత్తగా యాక్ట్ చేశాడు. ఒక తెలుగు సినిమా స్టార్ హీరోలాగా ఎక్కడా చేయలేదు.

                    మామూలుగా తెలుగు స్టార్ హీరో సినిమా అంటే ఎలా ఉంటుంది. సినిమా స్టార్టింగ్ సీన్ నుంచి ఎండింగ్ సీన్ వరకూ సినిమా అంతా హీరోనే కనిపిస్తాడు. సీన్ బిగినింగ్, ఎండింగ్ కూడా హీరోపైనే ఉంటుంది. పైగా దాని గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు కూడా. కానీ జనతా గ్యారేజ్‌లో మాత్రం ఎన్టీఆర్ చాలా కొత్తగా కనిపించాడు. నిజాయితీగా చెప్పాలంటే కంప్లీట్ నటుడిగా కనిపించాడు. సినిమా మొత్తంలో ఎక్కడా కూడా ఎన్టీఆర్ కనిపించలేదు. ఆనంద్ క్యారెక్టర్ మాత్రమే కనిపించింది. కథలో భాగమయ్యాడు. క్యారెక్టర్‌కి జీవం పోశాడు. నిజానికి సినిమా అంతా తానే కనిపించాలని, తన స్టార్ ఢం కోసం సీన్స్ ఉండాలని ఎన్టీఆర్ పట్టుబట్టి ఉంటే కొరటాల శివ కూడా కాంప్రమైజ్ అయి ఉండేవాడు. కానీ ఎన్టీఆర్ మాత్రం ‘జనతా గ్యారేజ్’ సినిమానే హీరో అవ్వాలనుకున్నాడు. నిజానికి ఎన్టీఆర్ స్టార్ ఢం కోసం కథను మార్చి ఉంటే ‘జనతా గ్యారేజ్’ కూడా రెగ్యులర్ తెలుగు కమర్షియల్ సినిమానే అయి ఉండేది. అలా కాకుండా జనతా గ్యారేజ్ కథ బ్రతకాలి, నేను ఆనంద్ క్యారెక్టర్‌కి జీవం పోయాలి అని ఎన్టీఆర్ అనుకున్నాడు కాబట్టే ‘జనతా’ సినిమా చాలా ఫ్రెష్‌గా కనిపించింది. కొత్తగా కూడా అనిపించింది. సినిమాలో కొరటాల శివ చేసిన కొన్ని తప్పులు ఉన్నప్పటికీ ఆ కొత్తదనం నచ్చే అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఎన్టీఆర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అవ్వడంతో పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్రలో టాప్ ఫైవ్‌లో జనతా గ్యారేజ్ చోటు దక్కిందుకుంది.

                     కథ మొత్తం తన చుట్టే తిరగాలి, తన స్టార్ ఢం బాగా హైలైట్ అయి కనిపించాలి అని అనుకోకుండా కథలో భాగమవ్వాలి అని, ఓ క్యారెక్టర్‌ని అద్భుతంగా పండించిన టాప్ రేంజ్ స్టార్ హీరో తెలుగు వరకూ చూసుకుంటే ఎన్టీఆర్ ఒక్కడే. బ్లాక్ అండ్ వైట్ కాలంలోనో, దశాబ్ధాల క్రితమో ఇలా జరిగి ఉండొచ్చేమో కానీ ఎన్నో సంవత్సరాల తర్వాత మొదటి సారిగా, సోలో హీరోగా యాక్ట్ చేసిన సినిమాలో, ఇలా క్యారెక్టర్‌లో ఒదిగిపోయిన నటుడు ఎన్టీఆర్ ఒక్కడే. ఇకపైన కూడా ఇలాంటి సినిమాలు తన నుంచి చాలా వస్తాయని ఎన్టీఆర్ చెప్పాడు. హిందీలో అమీర్ ఖాన్‌లాంటి హీరోలు ఉన్నారేమో కానీ తెలుగులో మాత్రం ఈ ట్రెండ్ స్టార్ట్ చేసింది ఎన్టీఆరే. ఇదే స్టైల్‌లో ఇంకో రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాడంటే మాత్రం ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది స్టార్ హీరోస్ కూడా ఎన్టీఆర్‌ని ఫాలో అవుతారని చెప్పడానికి డౌటే అవసరం లేదు. ఆ తర్వాత తెలుగులో మంచి మంచి కథలు వస్తాయని కూడా చెప్పొచ్చు. అలాంటి ఓ మంచి మార్పుకు… ఓ కొత్త చరిత్రకు ‘జనతా గ్యారేజ్’ సినిమాతో ఎన్టీఆర్ నాంది పలికాడు. అందుకు ఎన్టీఆర్‌ని కూడా తెలుగు ఇండస్ట్రీ జనాలందరూ అభినందించాల్సిందే.