ఒక్క బాలయ్యకి తప్ప అందరికీ హ్యాండిచ్చిన నయనతార


నటి నయనతారకు అదేం అలవాటో తెలీదు కానీ.. ఈ అమ్మడు ఇప్పటివరకు తాను నటించిన ఏ తెలుగు సినిమానీ ప్రమోట్ చేసిందిలేదు. అంతెందుకు.. గ్రాండ్‌గా నిర్వహించే ఆడియో వేడుకలకు కూడా ఆమె అటెంట్ అవ్వదు. ఒక్క సినిమాకి తప్ప.. మరే మూవీ ఆడియో లాంచ్‌కి ఈమె రాలేదు. ఇందుకు సరైన కారణం తెలీదు కానీ.. ఇలా హాజరుకాకపోవడం పట్ల మాత్రం యూనిట్‌తోపాటు ఫ్యాన్స్ కూడా విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ‘బాబు బంగారం’ ఆడియో వేడుకకి ఈమె హాజరు కాకపోవడంతో.. మళ్ళీ ఆమె టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది.

సాధారణంగా జరిగే ఆడియో ఈవెంట్లలో హీరోయిన్లే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తారు. వీరిలా హాజరు కావడం వల్ల యూనిట్, ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేయడమే కాదు.. ఆయా భామల క్రేజ్ కూడా పెరుగుతుంది. ఒకవిధంగా చెప్పాలంటే.. వాళ్ళకే లాభం. అయినా కూడా నయన ఇలాంటి ఈవెంట్లకు హాజరవ్వదు. గతంలో కొన్ని ఆడియో ఈవెంట్లకు ఈమె అటెండ్ కాకపోవడంతో ఫ్యాన్సే కాదు.. ఆయా సినిమాల యూనిట్స్ కూడా మండిపడ్డాయి. అంతెందుకు.. స్వయంగా రామానాయుడు లాంటి పెద్దాయనే ఓసారి నయనతారను ఉద్దేశించి గట్టిగానే విమర్శలు గుప్పించారు. తమ బేనర్లో తీసిన ‘తులసి’ ఆడియో వేడుకకు నయన్ రాకపోవడంపై స్పందిస్తూ.. పరోక్షంగా ఆమెకు కౌంటర్ ఇచ్చారు. అయినా నయనలో ఏ మార్పూ లేదు. ఆదివారం (24-07-2016) రాత్రి జరిగిన ‘బాబు బంగారం’ ఆడియో వేడుకకైనా నయన వస్తుందని భావించారు కానీ.. ఈసారి కూడా ఆమె హ్యాండ్ ఇవ్వడంతో వెంకీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. అయితే.. ఒక్క బాలయ్యకి మాత్రం ఈమె హ్యాండ్ ఇవ్వలేదు.

తెలుగులో పదికి పైగా సినిమాలు చేసిన నయన.. ఒక్క ‘శ్రీరామరాజ్యం’ ఆడియో వేడుకకు మాత్రమే వచ్చింది. ఆ సినిమాకు రావడానికి కూడా ఒక బలమైన కారణం ఉందిలెండి. తనకున్న సెక్సీ ఇమేజ్‌ను పట్టించుకోకుండా సీత పాత్ర ఇచ్చి.. తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాను అందించినందుకు బాపుగారికి కృతజ్ఞత చెప్పుకోవడం కోసమే ఆమె హాజరయ్యింది. ఇలా ఈ విధంగా ఒక్క బాలయ్యకు నయనతారను తన ఆడియో వేడుకలో చూసే అదృష్టం దక్కిందన్నమాట.


కామెంట్‌లు