ప్రధాన కంటెంట్‌కు దాటవేయి
కొడైకెనాల్ లో బాబాయ్ తో పాటూ సెల్ఫీ దిగిన రానా
మండే ఎండల్లో షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చి కొందరు స్టార్స్ విదేశాలకు పయనమవుతుంటే... మరి కొందరు ఏకంగా విదేశీ షెడ్యూల్ ను ప్లాన్ చేసుకుని.. పనిలో పనిగా వెకేషన్ ను కూడా ఎంజాయ్ చేసేస్తున్నారు. అయితే... దగ్గుబాటి కుటుంబం మాత్రం... వేసవి తాపానికి దూరంగా హాయిగా కొడైకెనాల్ లో సేద తీరుతోంది. రానా ఇటీవలే ట్విట్టర్ లో పోస్ట్ చేసిన సెల్ఫీ ద్వారా వారి సమ్మర్ వెకేషన్ గురించి తెలిసింది. బాబాయ్ వెంకటేశ్ తో పాటూ సరదాగా ఎంజాయ్ చేస్తున్న రానా... ఆయనతో పాటూ దిగిన సెల్ఫీని ట్విట్టర్ లో పోస్ట్ చేసి ఫ్యాన్స్ కు మాంచి కిక్ ఇచ్చాడు. ఇకపోతే దగ్గుబాటి వారి వెకేషన్ వెనుక... వారి కుటుంబ కథా చిత్రం తెరకెక్కే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది.
మామూలుగానే కథా చర్చల నిమిత్తం ఊటీ, కొడైకెనాల్ వంటి ప్రాంతాలకు వెళుతుంటారు సినీజనం. అయితే... తమ సమ్మర్ వెకేషన్ లో భాగంగా దగ్గుబాటి హీరోలు కూడా ఎప్పటినుంచో అనుకుంటోన్న తమ ఫ్యామిలీ చిత్రానికి సంబంధించిన చర్చల్లో కూడా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. వెంకటేశ్, రానా ప్రధాన పాత్రల్లో నటించనున్న ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని సురేశ్ బాబు నిర్మించనున్నట్లు సమాచారం. ఏమైనా... ఈ వెకేషన్ పుణ్యమాని స్వామికార్యం, స్వకార్యం కూడా పూర్తి చేసుకునే పనిలో పడ్డ దగ్గుబాటి హీరోలు.. వచ్చేటప్పుడు ఓ మాంచి వార్తను కూడా మోసుకొస్తారేమో చూడాలి.