తల్లిదండ్రులు చూసిన సంబంధానికి బొమ్మాళీ గ్రీన్ సిగ్నల్!

టాలీవుడ్ జేజమ్మ త్వరలో పప్పన్నం పెట్టేస్తుందన్న వార్త చాలా కాలంగా వినిపిస్తున్నదే! అయితే.. ఇప్పటివరకూ ఆ దిశగా ఏ డెవలప్ మెంట్ లేదు సరికదా... అమ్మడు ఎప్పటిలాగానే చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతుండటంతో... జనాలు కూడా ఆ విషయాన్ని లైట్ తీసుకున్నారు. కానీ, అనుష్క తల్లిదండ్రులు మాత్రం ఈ విషయంలో కాస్త సీరియస్ గానే ఉన్నారట. అందుకే... ఎలాగైనా ఈ ఏడాది స్వీటికి పెళ్లి చేసేయాలని అనుకుంటున్నారట. అంతేకాదు... ఇప్పటికే ఆ దిశగా చాలానే ఏర్పాట్లు కూడా జరిగిపోతున్నాయని తెలుస్తోంది. ఈ వార్తే ప్రస్తుతం టిన్సెల్ టౌన్ లో హాట్ డిస్కషన్ గా మారింది.
ఆ మధ్య బాహుబలి, రుద్రమదేవి సినిమాల తరువాత అనుష్క పెళ్లి చేసుకుంటుందని బలంగానే వినిపించింది. కానీ, ఆ సినిమాల షూటింగ్ పూర్తవుతూనే అమ్మడు సైజ్ జీరో సినిమాకు డేట్లు కేటాయించేసి పెళ్లివార్తలకు చెక్ పెట్టేసింది. ఇకపోతే తాజా సమాచారం మేరకు అనుష్క పెళ్లికి ముహూర్తం ఖరారు అయినట్లే కనిపిస్తోంది. తల్లిదండ్రులు చూసిన సంబంధానికి పచ్చజెండా ఊపేసిన బొమ్మాళీ ఈ ఏడాదే పెళ్లాడేందుకు కూడా అంగీకరించేసిందట. వెడ్డింగ్ కోసం అమ్మడు దుబాయ్ లో షాపింగ్ కూడా చేసేసిందట. అందుకే సైజ్ జీరో షూటింగ్ ను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని యూనిట్ పై ఒత్తిడి తెస్తోందట అనుష్క. ఏమైనా... ఈ పాలరాతి శిల్పం ఒకింటిది అవుతుందంటే... సంతోషపడని వారు ఎవరుంటారు! కాకపోతే... పెళ్లయ్యాక అమ్మడు సినిమాలకు దూరమవ్వకుండా ఉంటే చాలు అన్నది అభిమానుల మాట. మరి... అనుష్క ఫ్యాన్స్ చిరు కోరికను మన్నిస్తుందో లేదో చూడాలి.