మస్తాన్‌బాబు ఖాతాలో మరో ప్రపంచ రికార్డు

ఆండీస్‌ పర్వతాల్లోని పది శిఖరాల అధిరోహణ
బేస్‌ క్యాంపునకు మల్లి భౌతికకాయం
సంగం: పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబు అశువులు బాసిన చివరి ఘడియల్లో తన ఖాతాలో మరో ప్రపంచ రికార్డును నమోదు చేసుకున్నట్టు తాజాగా వెలుగుచూసింది. మార్చి 23వ తేదీన సాయంత్రం 4 గంటలకు ఆండీస్‌ పర్వతాల్లోని పదవ శిఖరాన్ని ఎక్కినట్టు ఆయన వద్ద ఉన్న కెమెరాలోని ఫొటోలను బట్టి తెలుస్తోంది. భౌతిక కాయం తీసుకురావడానికి వెళ్లిన హెర్నన్‌ సంస్థ ప్రతినిధులు ఈ విషయాన్ని గుర్తించారు. మస్తాన్‌బాబు ప్రపంచంలోని ఏడు ఖండాల్లోని ఏడు ఎత్తైన పర్వతాలపై భారతీయ జెండాను ఎగురవేసి గిన్నిస్‌బుక్‌ రికార్డు సాధించారు. తద్వారా ఆసియాలో ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా గుర్తింపు పొందాడు. అనంతరం ఆండీస్‌ పర్వతాల్లోని 10 ఎత్తైన శిఖరాలను ఎక్కాలని కలలుగన్నాడు. అందులో భాగంగా అర్జెంటీనా, చిలీ సరిహద్దుల్లో ఉన్న శిఖరాలను ఎక్కేందుకు ఓ బృందంతో బయలుదేరాడు. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా బృం దసభ్యులు వెనుదిరగ్గా, అతనొక్కడే ధైర్యంగా ముందుకుసాగాడు. ఈ క్రమంలోనే మస్తాన్‌ మృతిచెందాడు.
జాతిరత్నం మస్తాన్‌బాబు : జగన్‌
ఆత్మకూరు: భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన మల్లి మస్తాన్‌బాబు జాతి రత్నమని వైసీపీ అధినేత, ప్రతిపక్షనాయకుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. మస్తాన్‌బాబు స్మారకస్థూపం రాష్ట్ర రాజధానిలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానన్నారు. మంగళవారం ఆయన మస్తాన్‌బాబు స్వగ్రామానికి విచ్చేసి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ వారంలో నెల్లూరుకు భౌతిక కాయం
న్యూఢిల్లీ: మస్తాన్‌బాబు భౌతిక కాయాన్ని శిఖరం నుంచి కిందికి తీసుకువచ్చినట్టు పట్టణాభివృద్ధి శాఖా మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. మస్తాన్‌ పార్థివదేహాన్ని ఈ వారాంతంలోగా భారత్‌కు తీసుకురానున్నట్టు చెప్పారు.

కామెంట్‌లు