మీ చేతకానితనానికి నన్నంటే ఏం లాభం? – చంద్రబాబు

CBN
తెలంగాణలో విద్యుత్‌సమస్యకు చంద్రబాబే కారణమంటూ తెలంగాణా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు,భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు తదితరులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విషయమై గురువారం చంద్రబాబు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, తన చేతకానితనానికి నన్ను నిందించటం వల్ల ఎటువంటి లాభమూ ఉండదన్నారు. కేవలం రాజకీయ లబ్దికోసమే తనపై కెసి ఆర్‌ విమర్శలు చేస్తున్నట్లు చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
రాష్ట్రం విభజన జరుగుతున్నపుడు తెలంగాణాలో విద్యుత్‌ సమస్యలు తలెత్తుతాయని కెసిఆర్‌కు తెలియదా అంటూ ప్రశ్నించారు. విద్యుత్‌ సమస్యను అధిగమించటం కోసం కెసిఆర్‌ చేసిన కృషి ఏమిటని నిలదీశారు. ఏపీలో విద్యుత్‌ సమస్యలు తలెత్తుతాయని తాను ఊహించగానే కేంద్రంతో మాట్లాడుకున్నానన్నారు. విద్యుత్‌ సమస్య పరిష్కారం కోసం కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి పియూష్‌గోయెల్‌ను తాను ఆరు సార్లు కలిసినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. మరి, కెసిఆర్‌ ఎన్నిసార్లు కలిసారో చెప్పాలన్నారు. విద్యుత్‌ సమస్యపై తనను కెసిఆర్‌ ఒక్కసారి కూడా కలవలేదని పియూష్‌గోయెలే బాహాటంగా చెప్పిన విషయం నిజం కాదా అంటూ విలేకరులను ప్రశ్నించారు.
ప్రతీ సమస్యకూ తనను విమర్శించటం ద్వారా లబ్ది పొందుదామని కెసిఆర్‌ అనుకుంటే కుదరదన్నారు. తెలంగాణాలో సమస్యలను పరిష్కరించుకోకుండా ప్రతీ విషయానికీ ఆంధ్రాపై విధ్వేషం చిమ్మటం ఎవరిని ఉద్దరించటానికని చంద్రబాబు తీవ్రంగా కెసిఆర్‌ను ప్రశ్నించారు. ప్రతీ దానికీ ఆంధ్రులు దోచుకుంటున్నారని పదేపదే చెప్పటాన్ని ముఖ్యమంత్రి తప్పు పట్టారు. పదే పదే ఇదే విషయాన్ని చెబుతుంటే అంతర్జాతీయంగా రాష్ట్రంపై ఎటువంటి అభిప్రాయం కలుగుతుందో ఒకసారి ఆలోచించుకోవాలని కెసిఆర్‌కు చంద్రబాబు హితవు పలికారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై తెలంగాణాలో విధ్వేషాలు రెచ్చగొట్టటం తగదన్నారు

కామెంట్‌లు